దేవునిపల్లి, బతుకమ్మ :
దేవునిపల్లి మండలంలోని లక్ష్మీదేవి గార్డెన్‌లో సోమవారం సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ సబ్-ఇన్‌స్పెక్టర్ నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అలాగే ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని, బ్యాంకు అధికారులు గానీ, పోలీసు అధికారులు గానీ ఫోన్ ద్వారా ఓటీపీ అడగరని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, పోలీస్ కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు మాటలు, పాటల ద్వారా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

