నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : అటు అధికారుల అలసత్వం.. ఇటు పట్టభద్రుల్లో చైతన్య లోపం వెరసి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తూతూ మంత్రంగా జరగబోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ’బతుకమ్మ‘ ఆన్లైన్ పత్రికలో వస్తున్న వరస కథనాలకు అధికారంలో స్వల్ప కదలిక వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పట్టభద్రుల ఓటర్ నమోదుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. మీసేవ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఉచిత సలహాలు మాత్రమే ఇస్తున్నారు. కనీసం దరఖాస్తు ఫారాలు సైతం ఏ ఒక్క గ్రామపంచాయతీలో అందుబాటులో లేవంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా జాతి నిర్మాణంలో మేము సైతం అంటూ స్వచ్ఛందంగా కదలాల్సిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుకై ఆసక్తి చూపడం లేదని చెప్పాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టభద్రుల యొక్క భాగస్వామ్యం ఉండాలని రాజ్యాంగంలో ప్రత్యేకంగా పట్టభద్రులకు ఎమ్మెల్సీ నియోజకవర్గం కేటాయించి డిగ్రీ అర్హత పొందిన మూడు సంవత్సరాలకు మన భారత రాజ్యాంగం వీరికి విధిగా ఓటు హక్కు కల్పించింది. మారిన పరిస్థితులకు అధునాతన సాంకేతిక పద్ధతులకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం పట్టభద్రులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుండి ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకునే వెసులుబాటు సైతం కల్పించింది. అనుక్షణం చేతిలో స్మార్ట్ ఫోన్లను చూస్తూ ఆన్లైన్లో ఉండే పట్టబద్రులు సైతం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ నమోదు విషయంలో మాత్రం ఆసక్తి చూపడం లేదు. నిజామాబాద్ మెదక్ కరీంనగర్ అదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గం లో అనధికారిక అచనా ప్రకారం ఎనిమిది లక్షలకు పైగా పట్టభద్రులు ఉన్నారు. కాగా నేటికీ కేవలం ఒక లక్ష 98 వేల మంది మాత్రమే తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి, బి ఎల్ వో అలసత్వం వెరసి క్షేత్రస్థాయిలో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు జరగడం లేదు. దీనికి తోడు ఇదివరకు ఓటు వేసిన పట్టభద్రులు సైతం తిరిగి తమ ఓటు హక్కు కొరకు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్న చిత్రమైన నిబంధనతో సైతం పట్టభద్రులు కార్యాలయాల చుట్టూ తిరగలేక ఓటు హక్కు నమోదు చేయడంలో ఆసక్తి చూపించడం లేదు. మరోపక్క ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చినప్పటికీ పట్టభద్రుడు ఆసక్తి చూపడం లేదు కేవలం పట్టణ ప్రాంతాల్లో ఔత్సాహిక ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు డిగ్రీ కాలేజీలను సంప్రదించి పూర్వ విద్యార్థుల వివరాలు సేకరించి కొద్దిమేరకు పట్టభద్రుల ఓట్లు నమోదు చేశారు. అంతేతప్ప రాజకీయ పార్టీల్లో అటు అధికార ఇటు ప్రతిపక్ష నేతలు ఎవరు కూడా ఈ నమోదుపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదని విమర్శలు ఉన్నాయి. ఎవరూ చెప్పినా చెప్పకపోయినా బాధ్యతగా ఓటు నమోదు చేసుకోవాల్సిన పట్టభద్రులు 81% కు పైగా మంది తమ బాధ్యతను మరిచి ఓటు నమోదుకు కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న గ్రాడ్యుయేట్లలో 19 శాతం మంది కూడా నమోదు చేసుకోలేదంటేనే ఈ దుస్థితి ప్రజాసామ్యానికి గొడ్డలి పెట్టుగా అభివర్ణించవచ్చు.
పట్టభద్రులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి..
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు నేను సైతం అంటూ ముందుకు రావాల్సిన పట్టభద్రులు అన్ లైన్ ద్వారా కూడా ఓటు హక్కు నమోదు కు ఆసక్తి చూపక పోవడం బాధాకరం. ఇకనైనా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా పట్టభద్రులే స్వచ్ఛందంగా మిగిలిన ఈ మూడు రోజుల కాలంలో ఆన్లైన్ ద్వారా తమ ఓటు హక్కు నమోదు చేసుకుంటేనే ఆశించిన స్థాయిలో ఓటర్ల సంఖ్య నమోదు అయ్యే అవకాశం ఉంది. లేదంటే నామమాత్రపు ఓటర్లతో రాజకీయ పార్టీల ఎత్తుగడలో వారు అనుకున్న అభ్యర్థిని వక్రమార్గంలో చట్టసభకు పంపే అవకాశం ఉంటుంది!! ఇదే జరిగితే పట్టభద్రుల హక్కులపై చట్టసభల్లో గొంతెత్తే అవకాశం పోతుంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలతో పట్టభద్రుల ద్వారా సమ సమాజ నిర్మాణంలో రాజ్యాంగం ఆశించిన మార్పు కనుచూపుమేరలో జరగకపోవచ్చు. ఇందుకు అటు అధికారులే కాదు ఇటు అలసత్వం వహించే పట్టభద్రులు సైతం బాధ్యత వహించాల్సి ఉంటుందని పలువురు మేధావులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఫోర్త్ ఎస్టేట్ గా ఓటర్లను చైతన్యం పరచడమే బతుకమ్మ ఉద్దేశం..
మా బాధ్యతగా వరుస కథనాలు ప్రచురిస్తున్నాం. మీ బాధ్యతగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకొని, నిబంధనల ప్రకారం వ్యవహరించని అధికారులను మీ వద్దకు వచ్చేల, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసేలా చేయాలని, నిలదీయాలని, ప్రజాసామ్యాన్ని పరిరక్షించాలని పట్టభద్రులను బతుకమ్మ కోరుకొంటుంది.అట్లే ప్రభుత్వం ఓటు నమోదుకు మరింత గడువును గ్రాడ్యుయేట్ లకు ఇవ్వాలని కోరుతోంది.
