. . . రెండు డీఏల విడుదలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
. . . సీఎస్ తో ఉద్యోగ జేఏసీ నాయకుల చర్చలు సఫలం
. . . త్వరలోనే ప్రభుత్వ ఉత్తర్వులు
హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల (కరువు భత్యం) విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమవడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు డీఏలు ప్రభుత్వం అంగీకరించిన రెండు డీఏలలో ఒకటి 3.64 శాతం, మరొకటి 2.74 శాతం చొప్పున ఉద్యోగులకు అందనున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన డీఏలతో పాటు పదోన్నతులు, హెచ్ ఈఎస్ పై గత కొంత కాలంగా జేఏసీ ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం నుంచి పిలుపురావడంతో నిరసన కార్యక్రమాలకు తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెల్సిందే. ఉద్యోగులు చలో హైదరాబాద్ కు పిలుపునివ్వడంతో జేఏసీ ప్రతినిధులతో సీఎస్ మంగళవారం సమావేశానికి సమాచారం అందించారు. అయితే ఈ నెల 22న సమావేశం జరుగకపోవడంతో దానికి బుధవారానికి వాయిదా వేశారు. ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరి జేఏసీ నేతలతో చర్చలు జరిపి ప్రభుత్వం రెండు డీఏలు చెల్లించేందుకు సుముఖంగా ఉందని ప్రకటించారు. మొదటి డీఏ రాబోయే అక్టోబర్ నెల జీతంతో కలిపి ఉద్యోగులకు చెల్లించనున్నారు. రెండో డీఏ వచ్చే ఏడాది ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఉద్యోగుల హెల్త్ కవరేజ్ (ఉద్యోగుల ఆరోగ్య పథకం) కోసం ప్రతి ఉద్యోగి జీతం నుండి నెలకు 500 మినహాయించే ప్రతిపాదనకు కూడా ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. మొత్తం ఐదు పెండింగ్ డీఏలలో ప్రస్తుతానికి ఈ రెండు డీఏల విడుదలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక కేబినెట్ ఆమోదం, జీవో వెలువడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో డీఏల విడుదలకు అంగీకరించడంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 18 డిమాండ్లతో ఆందోళనకు దిగిన జేఏసీ కేవలం రెండు డీఏలతో నిరసన కార్యక్రమాలు నిలుపుదల చేయడంపై ఉద్యోగులు మాత్రం అసం తృప్తితోనే ఉన్నారు.

