. బీజేపీ, కాంగ్రెస్ లక్ష్యంగా సోషల్ మీడియాలో పోస్టులు
. హాస్టళ్లలో ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వంపై ఫైర్
. బీసీ డెడికేషన్ కమిటీకి జాగృతి ఆధ్వర్యంలో నివేదిక
. దీక్షా దివస్ రోజున జిల్లా కేంద్రానికి రానున్న ‘ఫైటర్’?
నిజామాబాద్, బతుకమ్మ : భారత జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరు నెలలపాటు తీహార్ జైలులో ఉండి ఆగస్టు నెలలో విడుదలైన కవిత.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో దూకుడు పెంచారు. ఆమె యాక్టివిటీ అటు బీఆర్ ఎస్, ఇటు జాగృతి శ్రేణులతోపాటు ఆమె అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. జైలు నుంచి విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనైన కవిత.. కేసీఆర్ బిడ్డ తప్పు చేసే ప్రసక్తే లేదని, తాను మంచిదాన్నైనా మొండిదాన్ని అని, తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని అన్నారు. ఆ తరువాత కొంత కాలంపాటు అనారోగ్యం, ఇతర కారణాలతో రాజకీయాలకు కొంత దూరం ఉన్నప్పటికీ ప్రస్తుతం పొలిటికల్ గా యాక్టీవ్ అయ్యారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని నిమ్స్ లో పరామర్శించడంతోపాటు ప్రస్తుతం రాష్ర్టంలో ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం కుల గణన చేపడుతున్న తరుణంలో జాగృతి ఆధ్వర్యంలో బీసీల సమగ్ర అధ్యయన నివేదికను తానే స్వయంగా డెడికేషన్ కమిటీకి అందజేశారు. తాజాగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ అదానీ వ్యవహారంపై నిలదీశారు. ‘‘అఖండ భారత్ అంటూ ప్రచారం చేసే వారు సెలెక్టీవ్ జస్టిస్ ను అందిస్తారు. ఎటువంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేసి విచారణ పేరుతో నెలల తరబడి జైలులో ఉంచుతారు. గౌతమ్ అదానీ వంటి వారిపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా ఆయనకు స్వేచ్ఛ కల్పిస్తారు. అదానీపై కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోకుండా ఆపేది ఏమిటి?’’ అంటూ నిలదీశారు. వీటన్నింటితో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చేసినట్లు సంకేతాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా బీఆర్ ఎస్ లోని మరో వర్గం మాత్రం అవన్నీ ఊహాగానాలే అంటున్నారు.
దీక్షా దివస్ రోజునే జిల్లా కేంద్రానికి..?
దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 29వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న దీక్షా దివస్ రోజున కవిత జిల్లా కేంద్రానికి వస్తారని బీఆర్ఎస్, జాగృతి శ్రేణులు అంటున్నాయి. దీంతో కవిత పొలిటికల్ రీ ఎంట్రీకి దీక్షా దివస్ వేదిక కానుందని ప్రచారం బలం చేకూరింది.
