- చేతులు మారుతున్న లక్షల రూపాయలు
రుద్రూర్, బతుకమ్మ: దీపావళి పండుగ రాకముందు నుండే రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గుట్ట ప్రాంతంలో జోరుగా పత్తాలాట కొనసాగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. పేకాటరాయుళ్లు, నిర్వాహకులు గ్రామస్తులకు కనబడకుండా గ్రామ శివారులోని గుట్ట ప్రాంతాలను అడ్డాగా చేసుకుంటున్నారు. పేకాటరాయుళ్లను మచ్చిక చేసుకొని కొందరు వ్యక్తులు టీములుగా ఏర్పడి పేకాటను నిర్వహిస్తూ లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు.
- మందు, విందు ఆట వద్దే..
పేకాట అంటేనే క్రేజీ గేమ్‌గా మారింది. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు పేకాట కొనసాగుతున్నది. ఉదయం వేళల్లో పేకాట నిర్వాహకులు రెక్కీ నిర్వహించి ఏ ప్రాంతం అయితే ఆటకు ఇబ్బంది ఉండదో, ఏ ప్రాంతంలో ఆట పెడితే పేకాటరాయుళ్లు వస్తారో అక్కడ అడ్డాలు ఏర్పాటు చేస్తున్నారు. పేకాడే స్థలానికి కొద్ది దూరంలో నిర్వాహకులు ఇద్దరు నుంచి నలుగురు వ్యక్తులతో నిఘా ఉంచుతారు. పేకాటరాయుళ్లను మచ్చిక చేసుకునేలా మందు, చికెన్, మటన్‌తో విందు ఏర్పాట్లు చేస్తూ డబ్బులను దండుకుంటున్నారు. పేకాడుతుండగా డబ్బులు పోయిన వారికి ఫైనాన్షియర్లు అప్పులు ఇస్తున్నారని, రూ. 10 వేలు ఇస్తే తర్వాత రూ. 11 వేలు ఇవ్వాల్సి ఉంటుందని ఒప్పందం చేసుకుంటున్నారని తెలుస్తున్నది. పేకాట నిర్వహించే వ్యక్తులు ప్రతిరోజూ కేట్ తీయడంతోపాటు మందు, తిండి ఖర్చులు పోనూ సుమారు రూ. 20 వేల వరకు దండుకుంటున్నారని సమాచారం. పేకాట ఆడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని, పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.