బతుకమ్మ, బిచ్కుంద : చదువులమ్మ చెట్టు నీడలో కలుసుకున్న అనుబంధం 19 సంవత్సరాల అనంతరం కూడా చెక్కు చెదరని ఆత్మీయత వారిలో కనిపించింది. బిచ్కుంద మండల కేంద్రంలోని వెంకటేశ్వర విద్యానికేతన్ పాఠశాలలో పదవ తరగతి (2006-2007) చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బిచ్కుంద మండలంలోని వెంకటేశ్వర విద్యానికేతన్ (పూర్వ పాఠశాలలో) నిర్వహించుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్వర విద్యానికేతన్ పాఠశాల తీసివేసినప్పటికీని తమ మధుర జ్ఞాపకాలు కలిగిన ఆ పాఠశాలలోనే ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని సంకల్పంతో ఆ పాఠశాల బిల్డింగ్ నందే జరుపుకుంటున్నామని పూర్వ విద్యార్థులు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువుల పాదాల పై పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. అనంతరం పూలమాలవేసి శాలువాతో సన్మానించి మెమొంటోను అందించి రాగి పాత్రలను కానుకగా ఇచ్చి పాదాభివందనం చేసి గురువుల ఆశీర్వాదం పొందారు. అనంతరం జరిగిన ఆత్మీయ పలకరింపులో భాగంగా చదువుకున్న రోజులలో చిలిపి, తీపి జ్ఞాపకాలను పంచుకొని మురిసిపోయారు. పూర్వ విద్యార్థులతో పాటు పూర్వ గురువులు కూడా అపూర్వ సమ్మేళనంగా సాగడం విశేషం. వెంకటేశ్వర విద్యానికేతన్ పాఠశాలలో విద్యా బోధనలో వారు కనబరిచిన విద్యుక్త ధర్మాన్ని, ఉపాధ్యాయుల స్నేహా నుబంధాన్ని మననం చేసుకున్నారు. అనంతరం ఆత్మీయ భోజనం చేసి వారి కుటుంబ స్థితిగతుల పై మాట్లాడుకున్నారు. ఈ అనుబంధం ఇంతటితో ఆగిపోకుండా తనువున్నంత వరకు ప్రతి సంవత్సరం ఇలాంటి ఈవెంట్ ను నిర్వహించుకోవాలని తీర్మానించుకున్నారు. తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పిన గురువుల సూచనలను తూచా తప్పకుండా పాటిస్తామని శపథం చేశారు. ఆత్మీయ సమ్మేళనంలో ఉపాధ్యాయులు చేసిన ఆత్మీయ భోజనంతో సంతృప్తి చెందామని గురువులు చెప్పడం శిష్యులుగా తమకి ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గురువులు, విద్యార్థుల తల్లిదండ్రులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.