- బిర్యానీ అమ్మినా, బీర్లు అమ్మినా ఓకే
- వే బిల్లు లేకున్నా పర్వాలేదు స్యాండ్ తరలించిన సప్పుడు చేయా
- అదనపు కాసుల కోసం వేదింపులతో వెలుగులోకి
నిజామాబాద్, బతుకమ్మ
ఆయన నిజామాబాద్ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్ వో. ఇటీవల కాలంలో పోలీస్ కమిషనర్ గా సాయిచైతన్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన శాంతిభద్రతలను గాడిలో పెట్టడానికి అవలంభిస్తున్న విధానాలను సొమ్ము చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తనకు పోలీసు ఉన్నతాధికారి దగ్గరా అని చెప్పుకుంటూ బహిరంగ వసూళ్ళకు దిగాడు. తన పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్ళు, బెల్టుషాప్ లు, చివరకు కల్లుబట్టిలను కూడా అందరి మాదిరి కాకుండా వారంతపు వసూళ్ళకు తెరలేపారు. కొత్తగా ఏర్పడిన ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి అయిందంటే దందాలు చేసుకునేవారంతా సార్ కు చందాలు ఇవ్వాల్సిందే. ప్రధానంగా నగరంలో రాత్రివేళ సంచారానికి పోలీసు బాసు చెక్ పెడితే అదే సమయంలో జరిగే బిర్యానీ, బీర్ల అమ్మకాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు ఎస్సై గారు. ఇటీవల కాలంలో బోధన్ రోడ్డులోని తారీ బిర్యానీ హోటళ్ళు నిర్వాహకుల వద్ద రాత్రి దందా కోసం రూ.40 వేలు వసూల్ చేసి బాస్ మెప్పు కోసం బైండోవర్ చేసి భయబ్రాంతులకు గురి చేశాడు. అది చాలదన్నట్లు కెమెరాలను ధ్వంసం చేసి దందాను నిర్వహించుకోవాలంటే అదనపు వసూళ్ళ కోసం డిమాండ్ చేయడంతో సారు గారి లీలలు బహిర్గతమయ్యాయి. అంతేగాకుండా స్టేషన్ పరిధిలో గోదాముల వద్ద ఉన్న ఒక హోటల్ వెనుక భాగంలో నిత్యం మద్యం అమ్మకాలు 24 గంటలు నడుస్తున్నాయి. వారానికి రూ.10 వేల చొప్పేన ఇస్తేనే దందా సాగాలంటూ ఒప్పందంతో నడుపుతున్నట్లు సమాచారం. అదేకాకుండా మరో బిర్యానీ హోటల్ కు నిజాంసాగర్ కాలువ వెనుక వైపు ఉన్న డోర్ ద్వారా దందాకు ఒప్పందం కుదిరితేనే నడుస్తున్నట్లు అక్కడ 24 గంటల పాటు జరుగుతున్న బిర్యానీ అమ్మేకాలు ఉదాహరణగా చెబుతున్నారు మాంసం ప్రియులు. నగరం మొత్తం హోటళ్ళు బంద్ అయినా యువత అంతా కూడా సారంగాపూర్ మైనార్టీ ఏరియాలో బైపాస్ రోడ్డు ద్వారా సంబంధిత హోటల్ కు వచ్చి బిర్యానీ పార్శిళ్ళు పోలీసు బాసు కట్టడిలోనూ సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇటీవల తన పోలీస్ స్టేషన్ డెకరేషన్ కోసమని ఇసుక వ్యాపారుల నుంచి టిప్పర్ కు వే బిల్లులు లేవని వసూల్ చేయడం గమనార్హం. ధర్మకాంట వద్ద ఇసుక టిప్పర్లు కనిపించగానే వే బిల్లు కోసం వాకబు చేసి టిప్పర్ల యజమానులను రప్పించి వారి వద్ద అమ్యామ్యాలు సమర్పిస్తేగానే వాటిని వదల్లేదని లారీ టిప్పర్ల యజమానులు వాపోతున్నారు. అమ్యామ్యాలు తీసుకున్నప్పటికీ పోలీస్ స్టేషన్ కు అవసరమైన ఇసుకను వారిచేతనే అదనంగా లోడ్ పోయించుకున్నారని యజమానులు లబోదిబోమంటున్నారు. తన స్టేషన్ ముందు వెళ్లే టిప్పర్లు కచ్చితంగా కాసులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇసుక సిండికేట్ వ్యాపారం ఎస్సైతో తమకు వచ్చిన గొడవ ఏమిటని నెలవారి మామూళ్ళను మాట్లాడుకుని దందాను కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
