. నిజామాబాద్ ముగ్గురు..
. ఆర్మూర్ లో నలుగురి అరెస్ట్
. పరారీలో తొమ్మిది మంది
. మాస్టర్ మైండ్ లు మహారాష్ఱ్టలో..
. ఇక్కడి వారు ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. యువకులను టార్గెట్ గా చేసుకొని బెట్టింగ్ యాప్ లు నడుపుతున్న వారు మహారాష్ర్టకు చెందిన వారు కాగా, ఇక్కడి వారు ఏజెంట్లు, సబ్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. నిజామాబాద్, ఆర్మూర్ లో మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేయగా, తొమ్మిది మంది పరారీలో ఉన్నారు. బెట్టింగ్ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను సీపీ సాయి చైతన్య శుక్రవారం వెల్లడించారు. కేసు వివరాలు ఆయన మాటల్లో..

నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భారతీరాణి కాలనీలో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు నార్త్ రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ అంజయ్య, ఐదో టౌన్ ఎస్సైలు గంగాధర్, లక్ష్మయ్య సిబ్బందితో కలిసి దాడి చేశారు. తన ఇంటి వద్దే సెల్ ఫోన్ లలో బెట్టింగ్ నిర్వహిస్తున్న షేక్ ముజీబ్ అహ్మద్(ఏ-1)తోపాటు షేక్ నదీం(ఏ-3), షేక్ జునైద్(ఏ-4), షేక్ రెహాన్(ఏ-5) ను అదపులోకి తీసుకున్నారు. సాలూరాకు చెందిన షకీల్ (ఏ-2), నిజామాబాద్ ఆటొనగర్ కుచెందిన షేక్ నజీబ్ (ఏ-6), మహారాష్ర్టలోని ధర్మాబాద్ కు చెందిన సచిన్(ఏ-7), ఆరెంజ్ ట్రావెల్స్ లో పనిచేసే నిజామాబాద్ కు చెందిన రమేశ్ (ఏ-8) పరారీలో ఉన్నారు. ఏ-1గా ఉన్న షేక్ ముజీబ్ అహ్మద్ పై గతంలో గేమింగ్ చట్టం ప్రకారం కేసులున్నాయి.
ఆర్మూర్ లో ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి బెట్టింగ్ ఆడుతున్న గట్టడి వడ్డ గౌతమ్ (ఎ1), దయాల్ సునీల్ (ఎ2), జాజు రంజిత్(ఎ3)ని అరెస్టు చేశారు. గట్టడి శ్రీకాంత్ (ఎ4)తోపాటు హర్యానాకు చెందిన విపుల్ మంగ్(ఏ5), మహారాష్ర్టకు చెందిన బంటు పలాస్ (ఏ6), బబ్లూ ఠాకూర్(ఏ7), వినాయక్(ఏ8) పరారీలో ఉన్నారు.
నిజామాబాద్, ఆర్మూర్ లో పట్టుబడిన వారి నుంచి పోలీసులు నగదు, సెల్ ఫోన్ లు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలో మూలాలు
నిజామాబాద్, ఆర్మూర్ లో పట్టుబడిన వారిని పోలీసులు విచారించగా బెట్టింగ్ మూలాలు మహారాష్ర్టలో ఉన్నట్లు తేలింది. అక్కడి వారే స్థానికులను ఏజెంట్లుగా, సబ్ ఏజెంట్లుగా నియమించుకుని యువతను బెట్టింగ్ ఊబిలోకి దింపుతున్నారని, ఇప్పటి వరకు 1200 మంది యువత యూజర్ ఐడీలు, పాస్ వర్డ్ లు పొందినట్లు తెలిసింది. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ కు చెందిన సచిన్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ కు మాస్టర్గా ఉండగా, అతనిపైన మరోవ్యక్తి సూపర్ మాస్టర్ గా ఉన్నాడని, మాస్టర్ కింద బుకీ గా ( ఏజెంటు గా ) ఉండాలని నిజామాబాద్ నగరానికి చెందిన పలువురికి యూజర్ ఐడీలు పాస్ వర్డ్ లు చ్చారు. మాస్టర్ నుంచి ఏజెంటుకు 7 శాతం కమీషన్ వస్తుంది.

డబ్బులు జమ.. విత్ డ్రా చేసేది వారే
క్రికెట్ బెట్టింగ్ యాప్ కు సంబంధించి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ పొందిన యువకులు తమ డబ్బులను ఏజెంట్లకు ఇస్తే వారే ఆన్ లైన్ లో జమ చేస్తారు. అలాగే విత్ డ్రా చేసుకోవాల్సి వస్తే వారే చేసి ఇస్తారు. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ పొందిన వారు కేవలం బెట్టింగ్ ఖాయడం వరకే పరిమితం కావాల్సి ఉంటుంది.

యాప్ లు, సైట్ లు ఇవే..
Diceexch.com, allpanelexch.com, 11xgame, Gbets5673com, Parimatehin.com, Wellbett7.com, VIP777.com, APP.bharathmatka.com, వంటి సైట్స్ ని ఏజెంట్ కు వివరించి అందులో నుంచి Diceexch.com, allpanelexch ఎంపిక చేసి బెట్టింగ్ కు సంబంధించి ఎంపికచేసిన వ్యక్తులకు యూజర్ ఐడీ పాస్ వర్డ్ లు ఇస్తారు. ఇలా నిజామాబాద్ కు చెందిన ఏజెంట్లు సుమారు వెయ్యి మందిని బెట్టింగ్ ఊబిలోకి దించారు.

ఆర్మూర్ లో పట్టుబడిన వారు కథ నడిపించారిలా..
హర్యానకు చెందిన విపుల్ మంగ్ మహారాష్ర్టకు చెందిన బబ్లూ ఠాకూర్, వినాయక్ ఠాకూర్ ఆర్మూర్ కు చెందిన గట్టడి వద్ద గౌతమ్, దయాళ్ సునీల్, జాజు రంజిత్, శ్రీకాంత్ కు యాప్ లను పంపించారు. ఆర్మూర్ కు చెందిన ఈ నలుగురు కొన్ని రోజుల నుండి క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. అలా క్రికెటు బెట్టింగ్ లో లాభం వచ్చిన డబ్బులను దయాళ్ సునీల్ అమాయక ప్రజలకు అధిక వడ్డీలకు ఇచ్చి వారి ద్విచక్రవాహనాలను తాకట్టు పెట్టించుకుంటున్నాడు.
