మెడికల్ కళాశాలలో డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు
రోస్టర్ నిబంధనలను పాటించలేదు
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్
కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా ఇటీవల నియమించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేశారని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం పేర్కొన్న రోస్టర్ నిబంధనలను పాటించకుండా డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలను ఇచ్చారని,తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి అన్యాయం చేశారని ఆరోపించారు. 50 ఉద్యోగాల కోసం 700 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే అందులో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని,ఇచ్చిన ఉద్యోగాలు ఏ ప్రాతిపదికన ఇచ్చారో వివరాలు తెలపలేదన్నారు. ఈవిషయమై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తప్పుడు మార్గం ద్వారా ఉద్యోగాలను పొందిన వారిని తొలగించకపోతే హైకోర్టును ఆశ్రయించి అర్హులకు న్యాయం చేసే వరకు పోరాడుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, నవీన్, సంతోష్, సందీప్, బాలకృష్ణ, ప్రభు, విష్ణువర్ధన్, నవనీత్, రాహుల్, రంజిత్, సాయి అంజి తదితరులు పాల్గొన్నారు.
