. . . జల్సాల కోసం పెడదారి పడుతున్న యువత
. . . గంజాయి పై పోలీసు వ్యవస్థ నిఘా పెట్టాలి
రుద్రూర్ బతుకమ్మ :
గంజాయి దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే, ఇదివరకు పట్టణాల్లో అక్కడక్కడ మాత్రమే దొరికే ఈ మత్తు పదార్థం. నేడు గ్రామాల్లోనూ విరివిగా లభిస్తోంది. దీంతో ఎంతోమంది యువత ఈ మత్తుకు బానిసై భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు చాక్లెట్ల మాదిరి ఎక్కడిక్కడ గంజాయి అమ్మేస్తుంటే మరికొందరు చాక్లెట్ల రూపంలో దీన్ని విక్రయిస్తున్నారు. ఇలా వివిధ రూపాల్లో గంజాయి యువత చెంతకు చేరుతూ వారిని పెడదారి పట్టిస్తోంది. సాయంత్రం వేళలో యువత, విద్యార్థులు రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టూ ప్రక్క గ్రామల్లోని పాఠశాలల్లో, చెరువు కట్టల వద్ద, డంపింగ్ యార్డుల వద్ద, బహిరంగ ప్రదేశాలలో గంజాయి సేవిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు విద్యార్థులు, యువకులు మద్యంతో పాటు గంజాయి, ఇతర డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు. లక్ష్యం వైపు సాగుతూ చదువుపై దృష్టి సారించాల్సిన యువత తప్పటడుగులు వేస్తూ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయిని సేవించడం సరదాగా అలవాటు చేసుకొని మత్తులో కూరుకుపోతున్నది.
. . . జల్సాల కోసం పెడదారి పడుతున్న యువత
కొంతమంది గంజాయి విక్రయాలు చేస్తున్న వారితో యువత దోస్తీ కడుతూ.. గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్నారు. చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేయాల్సిన యువత జల్సాల కోసం పక్కదారి పడుతున్నారు. ఈ యువత రాష్ట్రంలో ఏదో ఒకచోట తగు నేరాలకు పాల్పడి కేసుల పాలై నిండు జీవితాన్ని ఆగం చేసుకుంటుంది. యువతలో విద్యార్థులే అధికంగా ఉండటం వలన గ్రామాలలో పట్టణాలలో నిర్మానుష ప్రదేశాలలో గంజాయి సేవించి మత్తులో తూలుతున్నారు. బైకులపై ముగ్గురు ముగ్గురు యువకులు డ్రైవింగ్ చేస్తూ రహదారులపై హంగామా సృష్టిస్తున్నారు. ఈ మత్తులో కుటుంబ సభ్యులతో గొడవలకు దిగి డబ్బు కావాలని బెదిరించి ఏమాత్రం వెనకాడకుండా నేరాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఈ డబ్బుకి అలవాటు పడి దొంగతనాలకు కూడా వెనకాడటం లేదు. యువత గంజాయిని వివిధ రూపాలలో సేవిస్తూ, బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ల రూపంలో పేపర్ రోల్ లో చుట్టి విక్రయించటం వలన యువత చెడిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. దీనిపై పోలీస్ వ్యవస్థ నిఘా ఎక్కువగా పెట్టి అలాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

