నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన నడుస్తున్నాయని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ప్రభుత్వాల ఉదాసీనత మూలంగా పనులు పూర్తవటానికి మరొక రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ గౌరవాధ్యక్షులు దీకొండ యాదగిరి అన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం ప్రతినిధి బృందం అర్సపల్లి అభివృద్ధి కమిటీ సంయుక్తంగా అరసపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దీకొండ యాదగిరి మాట్లాడుతూ 137 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం 20 23లో ప్రారంభించారని, అది 2025 సెప్టెంబర్ కు పూర్తి కావాలని, ప్రస్తుతం పనులు మాత్రం నామమాత్రం జరుగుతున్నాయని ఆయన అన్నారు. అర్సపల్లి అభివృద్ధి కమిటి ప్రతినిధులు చాగంటి గంగాధర్, సిర్ప గంగాధర్, నాగయ్య తదితరులు మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు తాము తమ భూములను కారు చౌకగా ఇచ్చామని, కానీ గత మూడు సంవత్సరాలుగా తమకు మాత్రం దుమ్ము, ధూళి తో గ్రామంలోని అనేకమంది అనారోగ్యానికి గురయ్యారని, ఏడుగురు యాక్సిడెంట్ల మూలంగా చనిపోయారని, కొంతమంది అంగవైకల్యం పొందారని వారన్నారు. ప్రతిరోజు గంటల తరబడి రైల్వే గేటు మూసి వేయటం మూలంగా వందలాది వాహనాలు గ్రామంలో నిలబడి పోతున్నాయని , దీని మూలంగాసామాన్య జీవనం కూడా కొనసాగించలేకపోతున్నామని వారు వాపోయారు. నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కే రామ్మోహన్ రావు మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం విడనాడాలని, సర్వీసు రోడ్లను నిర్మించాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రవీంద్ర నాథ్ సూరి రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు సిర్ప హనుమాన్లు, ఈవిల్ నారాయణ, ప్రసాద్ రావు, నగర అభివృద్ధి కమిటీ నాయకులు హుస్సేన్, మధుసూదన్, రాధా కిషన్, లింగయ్య, భూమన్న, బాలన్న, తదితరులు పాల్గొన్నారు.
