27 C
Hyderabad

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ

Continuous monitoring to ensure no drinking water problems arise

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అధికారులతో సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

 

. . . నీటి వనరులు వృధా కాకుండా గట్టి నిఘా కొనసాగించాలి : కలెక్టర్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తూ నిరంతర పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. తీవ్ర వర్షాభావం, భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్న దృష్ట్యా రబీలో వరి పంట సాగు చేయవద్దని రైతులకు హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం కలెక్టర్ ఇలా త్రిపాతితో కలిసి మున్సిపల్ కమిషనర్లు,మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, ఆర్.డబ్ల్యూ.ఎస్,గ్రౌండ్ వాటర్, వ్యవసాయం, విద్యుత్ తదితర శాఖల అధికారులతో తాగునీటి సరఫరా,పంటల సాగు పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రధాన తాగునీటి వనరులుగా ఉపయోగపడుతున్న నిజాంసాగర్, శ్రీరాంసాగర్ జలాశయాలలో అందుబాటులో ఉన్న నీటి నిల్వల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఖరీఫ్ పంటలను ఏదోవిధంగా కాపాడుకోగలిగినా రబీలో పంటలకు సాగునీరు అందించడం కష్టతరంగా మారుతుందని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీరాంసాగర్ సహా ఇతర ప్రాజెక్టులలో అతి తక్కువ నీటి నిల్వలు అందుబాటులో ఉన్నందున తగినంత విద్యుత్ ఉత్పత్తి జరుగక, పంటలకు కరెంటు సరఫరాకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు యాసంగిలో తక్కువ నీటి అవసరం ఉండే కూరగాయలు, పప్పు దినుసులు వంటి పంటలు విత్తుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జలాశయాలలో నిలువ ఉన్న నీటిని పూర్తిగా తాగునీటి అవసరాలకు ఉపయోగించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వచ్చే పది నెలల వరకు నిజామాబాద్ నగరం సహా అన్ని మున్సిపల్ పట్టణాలు, గ్రామాలలో ప్రతి నివాస ప్రాంతానికి రక్షిత మంచి నీరు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా ప్రైవేట్ వ్యాపారులను, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జాగ్రత్తలు సూచించారు. ఖరీఫ్ లో ఆరుగాలం శ్రమించి సాగు చేసిన వరి పంటకు ప్రస్తుతం మార్కెట్ మంచి గిట్టుబాటు ధర పలుకుతోందని, దిగుబడులు కూడా ఆశించిన మేరకు చేతికి అందుతున్నాయని అన్నారు. అయితే రైతులు తమ పంటను నగదు పద్ధతిన విక్రయించాలని అన్నారు. గతంలో రైతుల నుంచి పంట సేకరించి నగదు చెల్లించకుండా పలువురు వ్యాపారులు మోసగించిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ తరహా ఘటనలు జరగకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని, నగదు చెల్లింపులు వెంటదివెంట జరిపే వారికే ధాన్యం విక్రయించాలని హితవు పలికారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎక్కడ కూడా నీటి వృధా జరుగకుండా గట్టి నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా దాహార్తి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అవసరమైన చోట మరమ్మతులు, తాగునీటి సరఫరా పనులు వేగంగా చేపట్టేలా చూడాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అవసరమైన చోట తాగునీటి కోసం వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప కొత్త బోర్లను తవ్వించకూడదని అన్నారు. ఎక్కడైనా తాగునీటి పైపులైన్లకు లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వార్డుల వారీగా పనిచేస్తున్న బోర్లు, వినియోగంలో లేని బోర్లను గుర్తించి అవసరమైన మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించి నీటి వృథాను అరికట్టాలని, జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో నీటి పొదుపుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continuous monitoring to ensure no drinking water problems arise
Continuous monitoring to ensure no drinking water problems arise

More articles

Latest article