. . . రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి దాన్ని బెల్లం తయారీ కేంద్రంగా మార్చేలా ప్రభుత్వానితో మాట్లాడేందుకు నేను వారధిగా ఉంటానని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. మంగళవారం చెరుకు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఆకుల పాపయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో బెల్లానికి మంచి డిమాండ్ ఉందని, చక్కెర ఉత్పత్తి కాకుండా ఈ ప్రాంత రైతుల డిమాండ్ మేరకు చక్కెర ఫ్యాక్టరీని బెల్లం ఫ్యాక్టరీగా మార్చేందుకు ప్రయత్నిస్తానని, రైతులకు న్యాయం చేయడానికి మా కమిషన్ ఉందని వారు అన్నారు. ఇటీవల మా కమిషన్ గద్వాల, ములుగు జిల్లాలో రైతులను మోసం చేసిన విత్తన వ్యాపారుల మోసాలను అరికట్టి వారి నుండి రైతులకు రావాల్సిన బకాయిలు రూ.4 కోట్లు ఇప్పించామని ఆయనన్నారు. రైతులు కష్టపడి పంటలు పండిస్తేనే నాలుగు మెతుకులు నోట్లోకి వెలుతాయని, అందుకే మీరు జరుపుతున్న పోరాటాలకు ఎప్పుడు మా రైతు ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆకుల పాపయ్య, లక్ష్మారెడ్డి, సిర్పూర్ గంగారెడ్డి మాట్లాడుతూ ఎన్సిఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించేందుకు ఈ ప్రాంత రైతులతో తగిన పోరాట కర్తవ్యాలను రూపొందించుకుంటామని అన్నారు. దశలవారీగా పోరాట కార్యక్రమం చేపడతామని, ముందుగా సంతకాల సేకరణతో స్థానిక శాసనసభ్యులకు మెమోరాండాలతో ప్రారంభిస్తామని, అంతిమంగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమం తీసుకువస్తామని తెలిపారు. ఫ్యాక్టరీని తెరిపించి బెల్లం కేంద్రంగా మార్చేంత వరకు రైతు పోరాటాలను కొనసాగిస్తామని వారు అన్నారు. ఈ సమావేశంలో పృథ్వీరాజ్, నాగయ్య, వేల్పూర్ భూమయ్య, గంగారెడ్డి, సాయ రెడ్డి, బన్సీ, రాధాకృష్ణ గౌడ్, దేవన్న, శ్రీధర్, కొట్టే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

