. . . ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
. . . సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
. . . టౌన్ 5 పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీపీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి, వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించే విధంగా సిబ్బంది వ్యవహరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-5 పోలీస్ స్టేషన్‌ను సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్ కి పోలీస్ అధికారులు, సిబ్బంది గౌరవ వందనం అందించగా, ఆయన వందనాన్ని స్వీకరించి అనంతరం స్టేషన్‌లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

మొదటగా స్టేషన్‌లో సిబ్బందికి అందుబాటులో ఉన్న కిట్ ఆర్టికల్స్, భద్రతా పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం రిసెప్షన్ సెంటర్‌ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. తదుపరి పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించిన కమిషనర్, కేసుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీట్ డ్యూటీ వ్యవస్థ, రౌడీషీటర్ లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు.

కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్టేషన్‌లో అమలవుతున్న “5 ఎస్ విధానం” అమలు తీరును సమీక్షించి, ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, అత్యవసర సహాయం కోసం వచ్చే ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని స్పందించాలని తెలిపారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల డిజిటల్ నిర్వహణ, సిబ్బంది హాజరు, డ్యూటీ విధానాలు తదితర అంశాలపై కూడా పోలీస్ కమిషనర్ ఆరా తీశారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరిగేలా క్రమశిక్షణతో, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు.

ప్రధానంగా అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్ పెక్టర్ కు సూచనలు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాల జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలు, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో గల విలేజ్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేసి, ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి సమాచారము తమపై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలన్నారు. ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ చేయాలని సూచించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలు సూచనలు చేశారు.

సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాదించాలనే అత్యాశతో యువత ఆన్ లైన్ బెట్టింగ్స్, ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ, సైబర్ మోసగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసి, చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారని అన్నారు. గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది 24X7 తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, సిబ్బంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీలో నిజామాబాద్ ఎ.సి.పి బి. ప్రకాష్ యాదవ్, నార్త్ రూరల్ సి.ఐ బి.శ్రీనివాస్, సి.సి.ఆర్.బి ఇన్స్ పెక్టర్ బి.అంజయ్య, టౌన్ 5 ఎస్.ఐ ఎమ్.గంగాధర్, ఎస్.ఐ 2 ఆర్.లక్ష్మయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

