. ధర పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వ గొప్పతనం అన్నారు
. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు
. రైతులు ఆందోళన చెందొద్దు
. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పసుపు ధర పెరిగిన సమయంలో అది కేంద్ర ప్రభుత్వ గొప్పతనమని, ఎగుమతులు చేపట్టడం ద్వారా ధర పెరిగిందని గొప్పలు చెప్పుకున్న ఎంపీ అర్వింద్, ప్రస్తుతం ధర తగ్గినా ఎందుకు మాట్లాడటం లేదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లా కాంగ్రెస్ భవన్ లో నుడా చైర్మన్ కేశ వేణుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత మూడు నాలుగు రోజులుగా పసుపు ధరపై జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నరని, పసుపు కొనుగోళ్లకు ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్ ను కోరామని తెలిపారు. ప్రత్యేకాధికారిని నియమించి రైతులకు న్యాయం చేస్తామని, ఆందోళన చెందొద్దని అన్నారు.
పసుపు బోర్డు తీసుకువచ్చానని గొప్పులు చెప్పుకునే ఎంపి అర్వింద్, నిజామాబాద్ లో పసుపు పండిస్తే బోర్డును ఢిల్లీలో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే పసుపు బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పసుపు ధర ఎందుకు తగ్గిందో చెప్పాల్సిన బాధ్యత జాతీయ పసుపు బోర్డు చైర్మన్, ఎంపీపై ఉందన్నారు. పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం తామెల్లప్పుడూ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.
ఎమ్మెల్సీ ఫలితాలపై సమీక్షిస్తాం
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ర్టంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ అండగా నిలిచినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడం నిరాశకు గురి చేసిందని మోహన్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 56వేల ఉద్యోగాలు ఇచ్చినా పట్టభద్రులు తమకు ఓటెందుకు వేయలేదో అర్థం కావడం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జిల్లా కాంగ్రెస్ నాయకులందరం కలిసి సమీక్షిస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షడు గోపి, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,బింగి శుభం, సాయి కిరణ్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
