27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బెబ్బులి పులి ఎక్కడ..?

Must read

📰 Generate e-Paper Clip

  • టైగర్ పై విష ప్రయోగం జరిగిందా..?
  • ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా పులి సంచారం
  • మాచారెడ్డి రేంజ్ లో ఆవుల మందపై దాడి
  • పులి కోసం పోలీసు, ఫారెస్టు అధికారుల వెతుకలాట

నిజామాబాద్, బతుకమ్మ : దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది. ఇటీవల సిరికొండ రేంజ్ పరిధిలోని తాటిపల్లి అటవి బీట్ లో గత వారం కనిపించిన పులి రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి అటవి ప్రాంతంలో ఆవుల మందపై దాడి చేయడం కలకలం రేపింది. జగిత్యాల అటవి ప్రాంతం నుంచి నిజామాబాద్, రాజన్నసిరిసిల్లా జిల్లాలో ప్రవేశించిన పులి అడుగుజాడల వేట కోసం నిజామాబాద్ అటవి శాఖ విశ్వప్రయత్నాలు చేసింది. తాటిపల్లి అటవి ప్రాంతంలో పులి అడుగులను గుర్తించిన అటవి శాఖాధికారులు రేంజ్ పరిధిలో గ్రామాలలో, తాండలలో ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరు కూడా అటవి ప్రాంతంలోకి వెళ్లవద్దని, సమీప ప్రాంతంలో పంట పొలాలకు విద్యుత్ తీగలు అమర్చవద్దని, అటవి జంతువుల కోసం విష పదార్థాలను పెట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయితే అడవిలో ఆహార వేటలో నిమగ్నమైన పెద్దపులి సమాంతర అటవి ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. సిరికొండ, ఇందల్వాయి ఫారెస్టు రేంజ్ అధికారులు పులి కోసం వేట సాగిస్తుండగా అది పొరుగు జిల్లాకు ఆహార అన్వేషణలో వెళ్లినట్లు గుర్తించారు.

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి ఫారెస్టు రేంజ్ పరిధిలోని రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలోని స్కూల్ తాండ అటవి ప్రాంతంలో రెండు రోజుల క్రితం పులి ఆవుల మందపై దాడి చేసినట్లు అటవి శాఖాధికారులు ఆలస్యంగా గుర్తించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు అటవి ప్రాంతం కలిసి ఉండడంతో వన్య ప్రాణులు రెండు జిల్లాల పరిధిలో సంచరించడం సర్వసాధారణం. కానీ కామారెడ్డి జిల్లా అధికారులు అటవి ప్రాంతంలో పులి సంచారాన్ని విస్మరించారో లేక క్షేత్రస్థాయిలో సెక్షన్ అధికారులను, బీట్ ఆఫీసర్లను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారో తెలియదు కానీ రామారెడ్డి మండలంలో పులి సంచారం విషయం రెండు రోజుల తర్వాత కానీ బహిర్గతం కాలేదు. అప్పటికే పులి ఆవుల మందపై దాడి చేసి ఒక ఆవును చంపివేసింది. ఈ విషయాన్ని పశువుల కాపరి అయిన మహిళ తాండ వాసులకు తెలుపడంతో వారు అప్రమత్తమైనట్లు తెలిసింది. పులి ఆహారం కోసం వేటకు వెళ్లి కచ్చితంగా దానిని మొత్తం తినే వరకు వదలదనే విషయం స్థానికులు గుర్తించారు. ఈ విషయంలోనే చనిపోయిన ఆవు కళేబరంపై విషంను చల్లినట్లు తాండాలో చర్చ జరుగుతుంది.

రామారెడ్డి మండలం స్కూల్ తాండ పరిధిలోని అటవి ప్రాంతంలో పులి సంచారం విషయం రెండు రోజుల తర్వాత గుర్తించిన అటవి అధికారులు దాని కోసం గాలింపు చేపట్టినట్లు తెలిసింది. అయితే అప్పటికే పులిపై విష ప్రయోగం జరిగిందనే విషయం అటవి అధికారుల వరకు తెలిసింది. ఆదివారం అటవి , పోలీసు అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టడం కలకలం రేపింది. అంతేగాకుండా పశు వైద్యాధికారులను రప్పించి ఆవు కళేబరంపై విష ప్రయోగం జరిగిందా? లేదా? అనే కోణంలో విచారించడం చర్చనీయాంశంగా మారింది. ఇందల్వాయి అటవి రేంజ్ పరిధి నుంచి ఆరు కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన జరుగడంతో అటవి అధికారులు పులి కోసం వేటను కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దశాబ్ధల తర్వాత పులి సంచారంతో ప్రజల్లో భయాందోళనలు ఉండగా ఏకంగా దానిపై విష ప్రయోగం జరిగిందనే విషయం ఇప్పుడు ఉమ్మడి జిల్లాల అటవి శాఖను కుదిపేస్తోంది.

Where is the tiger Bebbuli..?

More articles

Latest article