- ఉన్నత స్థాయి అధికారుల వేదింపులే కారణం?
- ఒత్తిళ్ళతో అధికారులే సతమతం
- ఉమ్మడి జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా శాఖలో పని చేయలేమంటున్న ఏఈలు
- రెండు నెలల్లో ఇద్దరు ఏఈల బలవణ్మరాలకు యత్నాలు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా శాఖ (మిషన్ భగీరథ) లో బలవణ్మరనాలు కలవరపెడుతున్నాయి. ప్రభుత్వాధికారులుగా ఐదంకెల జీతంతో దర్జాగా పని చేయాల్సిన అధికారులు ఆత్మ హత్యాయత్నాలకు పాల్పడడం కలకలం రేపుతోంది. జూనియర్లు, సీనియర్లు అంటూ తేడా లేకుండా అధికారులు ఒత్తిళ్ళకు గురవుతున్నారు. తమ పై స్థాయి అధికారుల వేదింపులు కావచ్చు, లేదా టార్గెట్ ప్రకారం ఒత్తిళ్ళు కావచ్చు ఇంజనీర్లే ఆత్మహత్యాయత్నాలు చేయడం ప్రస్తుతం ఆ శాఖను కుదిపేస్తున్నాయి. అధికారులు టార్గెట్ విధించి వేదిస్తున్నారని , గతేడాది రిక్రూట్ అయిన జూనియర్ ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పని ఒత్తిడి తాళలేక ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ ఈ నెల 6న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటు చేసుకుంది. ఈ నెల 6న తన విధులను ముగించుకుని తన సొంత ఊరు వెళ్లే క్రమంలో శ్రీకాంత్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 2018లో శ్రీకాంత్ ఆర్ డబ్ల్యూఎస్ లో ఏఈగా పని చేస్తున్నాడు. 2022లో షాద్ నగర్ కు బదిలీ అయింది. అయితే శ్రీకాంత్ డిప్యూటేషన్ పై బాన్సువాడలో విధులు నిర్వహిస్తున్నాడు. మిషన్ భగీరథలో టార్గెట్ లతో పాటు అధికార ఒత్తిళ్ళు, పని ఒత్తిళ్లు తాళలేకనే శ్రీకాంత్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏఈ స్థాయి అధికారి ఆత్మహత్యాయత్నం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. ప్రస్తుతం శ్రీకాంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ తనయుడు కె.సాయిచరణ్ జనవరి చివరి మాసంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. 2024లో రిక్రూట్ అయిన సాయిచరణ్ ఎన్నో ఆశలతో ఎఈఈగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తాను డిచ్ పల్లి ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాయిచరణ్ మరణం పట్ల జూనియర్ గా కొత్తగా రిక్రూట్ అయిన ఇంజనీర్లు నిజామాబాద్ మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రధానంగా మిషన్ భగీరథ అధికారుల వేదింపులు, టార్గెట్ లే సాయిచరణ్ ను బలిగొన్నాయని ఆందోళన చేశారు.
