నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
తన ఇంటి వివాదంలో కొడుకు ఫిర్యాదు చేస్తే తనను ఆ కారణంగా ఎస్సై, పోలీస్ సిబ్బంది తీవ్రంగా కొట్టడంతో తండ్రి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ సంఘటన ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయం వద్ద జరిగింది. భీంగల్ మండలం రూప్లా తండాకు చెందిన గుగులోత్ బీనుకు అతని కొడుకు మధ్య ఇంటి నిర్మాణం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శనివారం తన కోడుకు పోలీసులకు పిర్యాదు చేయడంతో బీనుకుడా పిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. అక్కడ భీంగల్ ఎస్సై మహేష్ తో పాటు సిబ్బంది కలిసి బీను లాఠీలతో చితక బాదారు. దీంతో తీవ్రంగా గాయపడగా అక్కడి నుంచి ఆర్మూర్ కు వెళ్లి చికిత్స తీసుకుని, తనను అకారణంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం సీపీకి పిర్యాదుకు తరలివచ్చారు. అక్కడ ఎస్ బి సీఐ శ్రీశైలం బాధితుడితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
పోలీస్ స్టేషన్ లో మద్యం మత్తులో న్యూసెన్స్ చేశారు… భీంగల్ ఎస్సై మహేష్
రూప్లా తండాకు చెందిన బీనుపై అతని కొడుకు ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ పిలిచాం. అతను మద్యం మత్తులో శనివారం న్యూసెన్స్ చేశారు. అప్పటికే అతనికి గాయాలు ఉన్నాయి. అతని కుటుంబ సభ్యులు కొట్టడంతో అయిన గాయాలు ఉన్నాయి. మేము అతడిని ఎవరు కొట్టలేదు. పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ చేసినందుకు ఒక కేసు, అతని కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీనుపై మరో కేసు నమోదు చేశాం.
పోలీస్ స్టేషన్ లో సీసీ కెమోరాలు పనిచేస్తున్నాయా?
ప్రతి పోలీస్ స్టేషన్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుకు పోలీస్ శాఖ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందుకే ప్రతి పోలీస్ స్టేషన్ లో పారదర్శక సేవలు ప్రారంభించింది. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ సెంటర్ కు అనుసంధానం చేసింది. అయితే భీంగల్ పోలీస్ స్టేషన్ లో రెండు రోజులుగా జరుగుతున్న వివాదం తాలూకు సిసి టివి పుటేజీ ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు ఈ విషయంలో విచారణలో సిసి కెమెరాల పనితీరు తో బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది.
