- సాధారణ ఎన్నికలను మరిపిస్తున్న వైనం
- నాలుగు సంఘాలకు ఒకేసారి ఎన్నికలు
- ఖర్చుకు వెనుకాడని అభ్యర్థులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వైశ్య సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేడిని పట్టణ వైశ్య సంఘం దాని అనుబంధ సంఘాల ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో రెండు ప్యానళ్లు, నాలుగు సంఘాలకు పోటీ పడుతున్నాయి. ఇది వరకు యువజన సంఘం ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో పట్టణ సంఘం ఎన్నికలతో పాటు దాని అనుబంధ మూడు సంఘాలకు ఇది వరకే నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 6న ఎన్నికలు జరుగనుండడంతో కోలాహలం నెలకొంది.
- ఎన్నికల షెడ్యూల్ ఇదే..
నిజామాబాద్ పట్టణ వైశ్యసంఘంతో పాటు శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల (మాణిక్ భవన్), పట్టణ ఆర్యవైశ్య భవన్ (కళ్యాణ మండపం) పాలకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆదివారం జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 7న పట్టణ ఆర్యవైశ్య సంఘం(కన్యకాపరమేశ్వరి ఆలయం)లో కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. రెండు రోజుల పాటు కౌంటింగ్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో 10,017 మంది ఓటర్లు ఉండగా ఓటింగ్ కు ఏర్పాట్లు జరిగాయి.
- రెండు ప్యానళ్ల మధ్యనే పోటీ..
నిజామాబాద్ ఆర్యవైశ్య పట్టణ సంఘం ఎన్నికలు దాని అనుబంధ సంఘాల ఎన్నికలు ఒకే రోజు జరుగనున్నాయి. ఎన్నికల్లో ఏకగ్రీవం అవకాశం లేకపోవడంతో పోటీ అనివార్యమైంది. పట్టణ ఆర్యవైశ్య సంఘంలో అర్వపల్లి పురుషోత్తం గుప్త ఒక ప్యానల్, ధన్ పాల్ శ్రీనివాస్ గుప్త మరో ప్యానల్ ద్వారా పోటీ పడుతున్నారు. నూతన వైశ్య ఉన్నత పాఠశాల (మాణిక్ భవన్) పాలవర్గానికి సీనియర్ ఇంజనీర్ గజవాడ హనుమంతురావు, ఇంగు శివప్రసాద్ లు పోటీ పడుతున్నారు. నగరంలోని వైశ్యభవన్ పాలకవర్గానికి ఇల్లెందుల సుధాకర్, విశ్వనాథం నారాయణలు పోటీ పడుతున్నారు. కన్యకాపరమేశ్వరి ఆలయానికి పాల్తి రవికుమార్, బాశెట్టి విశ్వనాథంల ప్యానళ్ళు పోటీ పడుతున్నాయి.
- సాధారణ ఎన్నికలకు మించిన ఖర్చులు..
నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికల ఖర్చును మించిపోయింది. ఇది వరకే పాంప్లెట్ లతో ప్రచారం చేసిన అభ్యర్థులు నగరం మొత్తం ఫ్లెక్సీలతో ముంచెత్తారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రెండు ప్యానళ్ళు బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్న చందంగా సాగుతున్నాయి. పొలిటికల్ లీడర్ల ఇన్వాల్ మెంట్ లేకపోయినప్పటికీ పరోక్షంగా ఆయా పార్టీల అనుబంధంతోనే ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అనుచరులు కాంగ్రెస్ అభిమానులుగా పోటీ చేస్తున్న ప్యానల్ కు మద్దతు పలికినట్లు సమాచారం. పేరుకు కుల సంఘం ఎన్నికలు కాగా జరుగుతున్నయి మాత్రం ప్రత్యక్ష ఎన్నికలు, పక్కా రాజకీయాల నాయకుల ప్రత్యర్థుల మాదిరిగా పోటీ పడుతున్నారు. కొందరు అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఒక అడుగుముందుకేసి చీరల పంపిణీ చేస్తున్నారని సమాచారం.
