- లైంగిక వేధింపుల బాధ్యులపై చర్యలేవి..?
- పేషెంట్ కేర్ కు బదిలీ చేస్తే సరిపోతుందా?
- బర్త్ డే పార్టీకి వసూళ్ల రాయుళ్ల పై చర్యలేవి..?
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటీవల వెలుగు చూసిన లైంగిక వేధింపుల ఘటనపై అధికారులు తీసుకుంటన్న చర్యలు కంటితుడుపు గా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. జీజీహెచ్ లో జరిగిన వేధింపులకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిపై తాత్కాలిక చర్యలు తీసుకోవడం పై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరిని పేషెంట్ కేర్ విభాగానికి పంపించడం, కంప్యూటర్ ఆపరేటర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై పలు ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల అండ చూసుకుని తోటి మహీళ ఉద్యోగినిలపై జరిపిన అమానుష వేధింపులపై లైంగిక వేధింపుల కమిటీకి ఫిర్యాదు చేయకుండా కేవలం పేషెంట్ కేర్ విభాగానికి పంపించడంపై అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజామాబాద్ జీజీహెచ్ లో గత ఏడాది కాలంలో పలువురు మహిళా ఉద్యోగినులపై అఘాయిత్యాలకు, వేధింపుల ఘటనలు ‘ బతుకమ్మ’ దిన పత్రికలో కథనం ద్వార వెలుగు లోకి వచ్చిన విషయం తెలిసిందే. జీజీహెచ్ లో పని చేసే పేషెంట్ కేర్ టేకర్ లు పీఏలుగా, డ్రైవర్ లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా చేసిన ఆక్రుత్యాలు అన్నీ ఇన్నీ కావు. వారికి ఒక మాజీ అధికారి, ఒక రిటైర్డ్ అధికారి తోడవ్వడంతో మహిళా ఉద్యోగినిలపై జరిగిన వేధింపులు కోకోల్లలు. ముగ్గురు , నలుగురు మహిళా సిబ్బందిపై అధికారుల పేరు చెప్పి వేధించడం, వినకపోతే మీ పై చర్యలు అని బెదిరించి లొంగదీసుకున్న ఘటనలు ఉన్నాయి. మహిళా సిబ్బందిపై జరిగిన వేధింపులపై అధికారులుగా వారే ఉండి కట్టడి చేయాల్సింది పోయి వారే పరోక్షంగా వేధింపులకు వత్తాసు పలకడంపై భిన్న వాదనలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో తాము ఉద్యోగులం, అధికారులం అనే విషయం మరిచి సొంత ఆసుపత్రి, సొంత సామాజ్ర్యం అన్న విధంగా వ్యవహరించిన తీరు అందరికి తెలిసిందే. పేదలకు వైద్యం అందదని.. ఫోన్ లో పైరవీల ద్వార చెబితేనే వైద్యం చేస్తారనే అపవాదు మూట గట్టుకుంది జిల్లా జనరల్ ఆసుపత్రి.
లైంగిక వేధింపులలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జీజీహెచ్ లో ఒక పేషెంట్ కేర్ టేకర్ ను సోమవారం నుంచి విధులకు రావద్ధని చెప్పిన అధికారులు అతడి విధినిర్వహణలో పేషెంట్ కేర్ కు బదిలీ చేయడంపై పలు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా పరిషత్ లో ఒక ముదురు చక్రం తిప్పి ఇద్దరు అధికార పార్టీ నామినేటేడ్ లీడర్లతో పైరవీ చేయించడంతో చర్యలు లేకుండా ఉద్యోగంలో కొనసాగించేలా చేశారనే వాదనలు ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలో ఒక అధికారి పుట్టిన రోజు వేడుకలకు ఒక్కో సిబ్బంది వద్ద రూ.500 వసూలు చేసిన కంప్యూటర్ ఆపరేటర్ పై చర్యలు తీసుకోకపోవడం పై ఆరోపణలు ఉన్నాయి. సదరు కంప్యూటర్ ఆపరేటర్ కూడా గతంలో లైంగిక వేధింపుల ఘటనలో కాంప్రమైజ్ చేసిన ఘనత జీజీహెచ్ అధికారులది. పేషెంట్ కేర్ టెకర్లు (తాత్కాలిక ఉద్యోగులు) రెగ్యులర్, కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగినిలపై వేధింపులకు పాల్పడితే వారిపై చర్యలకు వెనుకంజవేయడం పై వాదనలు ఉన్నాయి. ‘బతుకమ్మ’ లో వేధింపుల కథనం వచ్చిన నాటి నుంచి మహిళా సిబ్బందిపై రిటైర్డ్ ఉద్యోగి, మాజీ అధికారి ఒత్తిళ్లు చేశారని, ఎవ్వరు నోరు తెరిచి ఫలానా అని పేరు చెప్పిన ఉద్యోగాలు ఊడుతాయని బెదిరించినట్లు తెలిసింది. జీజీహెచ్ లో జరిగిన వేధింపులు భవిష్యత్తులో జరుగకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు ఉదాసీన చర్యలు కంటితుడుపులానే ఉన్నాయి. ఎప్పటికి ఆసుపత్రి అధికారులు మారుతారో అనే సంశయం వ్యక్తం అవుతుంది. ఆసుపత్రికి రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో వారు కొందరి చేతిలో కీలు బొమ్మలు లాగా వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి.
