. . . జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ :
గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి గ్రామస్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా మూడేళ్ల సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. 2026–27 నుంచి 2028–29 ఆర్థిక సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, విద్య, ఆరోగ్యం, ఉపాధి, నీటి సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు సంబంధించి ఏడు రకాల పింఛన్లకు అర్హులైన వారి నుంచి వచ్చిన దరఖాస్తులను గ్రామస్థాయిలో స్వీకరించి, అర్హతలను పరిశీలించి, సంబంధిత ఎంపీడీవోలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు దూరం కాకుండా పారదర్శకంగా దరఖాస్తులను పరిశీలించాలని, అర్హత ఉన్న వారికి నిబంధనల మేరకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ సమగ్ర ప్రణాళికల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతులు, లబ్ధిదారులకు అందించాల్సిన సహకారం, నిర్మాణ పురోగతి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. మంజూరైన ఇళ్ల నిర్మాణాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. జలశ్రీ కార్యక్రమం కింద వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే చర్యలకు గ్రామపంచాయతీ ప్రణాళికల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. చెరువులు, కుంటలు, కాలువలు, ఇంకుడు గుంతలు, పొలాల కుంటలు, భూగర్భ జలాల పునర్భరణకు సంబంధించిన పనులను గ్రామ అవసరాలకు అనుగుణంగా గుర్తించి ప్రణాళికల్లో చేర్చాలని తెలిపారు. ప్రతి చుక్క వర్షపు నీటిని సంరక్షించే విధంగా గ్రామస్థాయిలో చర్యలు చేపట్టాలని అన్నారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామపంచాయతీలకు అందుబాటులోకి వచ్చే నిధులను గ్రామాల ప్రాధాన్యత అవసరాలకు అనుగుణంగా, నిబంధనల మేరకు సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ సమగ్ర ప్రణాళికల తయారీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని, గ్రామ సభల ద్వారా అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. రూపొందించిన ప్రణాళికల అమలును అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యన్.వై. గిరి, డీఆర్‌డీఓ దామోదర్ రెడ్డి, డీపీఓ మురళి, సీఈవో చందర్, ఎంపీడీవోలు, ఎంఈఓలు, స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

