- లోడు పెరిగితే బరువు పెరగాల్సిందే
- విద్యుత్ అధికారుల తీరుతో రైతుల బెంబేలు
నిజామాబాద్, బతుకమ్మ:
దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడు అన్న చందంగా తయారయ్యింది విద్యుత్ శాఖా పరిస్థితి. నిబంధనల ప్రకారం సంస్థకు చెల్లించాల్సిన వాటిని డిడి రూపంలో జమ చేస్తున్నారు. వ్యవసాయం నిమిత్తం వినియోగించే విద్యుత్ ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుంది. దీనికి అవసరమయ్యే ట్రాన్స్ఫార్మర్ తో పాటు పరికరాలను రాయితీపై అందజేస్తుంది. అయినప్పటికీ డబ్బులు ముట్టనిదే పని ముట్టట్లేదనే ఆరోపణలు బహిరంగం అవుతున్నాయి. అందులోనూ జక్రాన్ పల్లి మండలంలో చేతివాటం ప్రదర్శన ఎక్కువైందని ఉన్నతాధికారులకు పిర్యాదు చేసే వరకు వెళ్ళింది.
- లోడు పెరిగిన ప్రకారం ..
విద్యుత్ వినియోగం పెరుగుతుండడంతో తరచుగా ట్రాన్స్ఫార్మర్ చెడిపోతుంది. దీనికి పరిష్కారమేంటని రైతులు స్థానిక అధికారులను సంప్రదిస్తే, లోడ్ పెంచాల్సి ఉంటుంది, దీనికి అయ్యే డబ్బులను సంస్థకు చెల్లించాలని సలహా ఇస్తున్నారు. విద్యుత్ సిబ్బంది సూచనల ప్రకారం లాంచనాలను పూర్తి చేద్దామని ముందుకెళ్తే, దరఖాస్తును పంపించేందుకుగాను ముందుగానే బేరాలు మాట్లాడుతున్నారు. దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ సామర్ద్యం పెంపు పనులు కొనసాగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
- ధర నిర్ణయించి చేతివాటం ….
రైతులకు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడానికి కెపాసిటీ (సామర్ద్యం) వారీగా ఇంత డబ్బు ఇవ్వాలని మండల విద్యుత్ అధికారి ధరలు నిర్ణయించారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారి అడిగినన్ని ఇస్తే పనులు సకాలంలో పూర్తవుతున్నాయని, ఇవ్వని వారి దరఖాస్తులను బుట్టలో వేస్తున్నారనే ఆరోపణలు రైతుల నుంచి వస్తున్నాయి. సామర్ద్యం పెంపు కోసం మండలంలో 63 కెవిఎ ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.40 వేల నుంచి రూ.50 వేలు, 100 కెవికి రూ.50 వేల నుంచి రూ. 60 వేల ధరలను అధికారి నిర్ణయించారు. దీనికి కాస్త హెచ్చు తగ్గులుంటే సరేగాని, బారీగా వ్యత్యాసం ఉంటే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు మండలంలో అధికారిని కలిసిన వారి నుంచి వినిపిస్తున్నాయి.
- మీటర్ బిగింపునకు ….
ఇళ్ళకు వినియోగించే విద్యుత్ కోసం మీటర్ అవసరం ఉంటుంది. దీనికి గాను గ్రామాలలో ఉన్న సిబ్బంది బిగింపుకై రూ. 2 వేలు అడుగుతున్నారని బాధితులు వాపోతున్నారు. వారు అడిగినంత ఇవ్వకపోతే దరఖాస్తును తిరస్కరించడం లేదంటే మీటర్ లోడ్ అని రాయడం లాంటివి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సిబ్బందిని ఉద్దేశించి, వారి నుంచి తిరస్కరణలు అందుకున్న విద్యుత్ వినియోగదారులు మాట్లాడుకోవడం గమనార్హం.
