- అమ్మకానికి ప్రయత్నాలు
- బైపాస్ రోడ్డులో ల్యాండ్ మాఫియా యత్నాలు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో బల్ధియాకు చెందిన పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేసి అమ్మకానికి సిద్దం చేశారు. కంఠేశ్వర్ శివారులో బైపాస్ రోడ్డు ఏర్పడడంతో వెంచర్ చేసినప్పుడు బల్ధియాకు వదిలేసిన ఓపెన్ ప్లేస్ ను చెరబట్టి అమ్మేందుకు సిద్దమయ్యారు. నిజామాబాద్ మున్సిపాలిటీకి వదిలిన 10 శాతం భూమిని ముక్కలుగా చేసి విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా పార్కు స్థలంలో షెడ్డులను నిర్మించి అమ్మకానికి రెడి చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ మున్సిపాలిగా ఉన్నప్పుడు 1998లో కంఠేశ్వర్ శివారులో సర్వే నంబర్ 219(అ), 219(ఆ)లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు వెంచర్ ఏర్పాటు చేశారు. దానికనుగుణంగా బల్ధియాకు పార్కు కోసం స్థలాన్ని కేటాయించారు. దాదాపు 3 వేల గజాల స్థలాన్ని ఓపెన్ ప్లేస్ గా ఎల్ పీ నంబర్ 15/98లో డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రి ప్లానింగ్ ద్వారా లేఅవుట్ అనుమతి పొంది వెంచర్ చేశారు. సంబంధిత వెంచర్ పక్క నుంచే మున్సిపాల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత బైపాస్ రోడ్డుకు రూపకల్పన జరిగింది. దానితో సంబంధిత భూమి ధరకు రెక్కలు వచ్చాయి. బైపాస్ రోడ్డులో భూమి ధరలకు రెక్కలు రావడంతో భూమాఫియా రంగంలోకి దిగింది. సంబంధిత వెంచర్ లో ఒకప్పుడు బల్ధియాకు రిజిస్ట్రేషన్ చేసిన 10 శాతం ల్యాండ్ లోని పార్కు స్థలంలో ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా పార్కు స్థలం కోసం కేటాయించిన భూమి వద్ద రేకులతో ప్రహారిని నిర్మించి గేట్లను ఏర్పాటు చేశారు. ఇది వరకే రెండు గేట్లను నిర్మించిన భూ మాఫియా ఈసారి వాటిని మార్కెట్లో విక్రయించేందుకు రంగం సిద్దం చేసింది.
గత ప్రభుత్వ హయంలో అధికార బీఆర్ఎస్ తో అంటకాగిన సదరు భూమాఫియా లీడర్లే సంబంధిత భూమిని చెరబట్టినట్లు సమాచారం. స్థానికంగా రెండు అపార్ట్ మెంట్ల నిర్వాహకులకు తమ పక్కన ఉన్న భూమిని బల్ధియాదేనని ఘంటాపదంగా చెబుతున్నారు. దుబ్బాకు చెందిన వెంచర్ వేసిన భూ యజమానుల ద్వారా సంబంధిత ఓపెన్ ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేసినట్లు రికార్డులను తయారు చేయడం విశేషం. బల్ధియా ల్యాండ్ మార్ట్ గేజ్ ను రిలీజ్ చేయకున్నా భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న లీడర్లు కాంగ్రెస్ పార్టీలో జంప్ అయి సంబంధిత భూమిని విక్రయించేందుకు ఏకంగా అధికార పార్టీ పేరు చెప్పి దందా షురూ చేసినట్లు సమాచారం. కోట్ల విలువ చేసే బల్ధియా భూమిని చెరబట్టేందుకు భూ మాఫియా పావులు కదుపుతుంది. గతంలోనూ భూ కబ్జా కేసులు నమోదైనా వెనక్కి తగ్గకుండా బల్ధియా స్థలాలను అమ్ముకునేందుకు రంగం సిద్దం చేయడం కలకలం రేపుతుంది. ఈ విషయంపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
