29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆ ముగ్గురు ఓకే అంటేనే టిప్పర్ నిండేది..

Must read

📰 Generate e-Paper Clip

ప్రభుత్వానికి డీడీ కట్టినా.. ఎమ్మెల్యే సాబ్ అనుచరులకు మళ్లీ ఇవ్వాల్సిందే
. ఇసుక రీచ్ లో ఆ ముగ్గురి ఆగడాలు
. వే బిల్లు డీడీ రూ.4,500 చెల్లించినా వారికి రూ.6,300 చెల్లించాల్సిందే..
. ఒక్క జేసీబీ బకెట్ ఇసుక అదనంగా వేస్తే రూ.వెయ్యి
. ఒక్కో టిప్పర్ వెనుక రూ.7వేలకు పైగా వసూలు చేస్తున్న ఘనులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

ఇసుక తరలించాలంటే ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి డీడీ మొత్తం చెల్లించి వేబిల్లు తీసుకుని నదీ ప్రాంతానికి వెళ్లినా ఫలితముండదు. ఆ ముగ్గురు నిర్ణయించిన మొత్తాన్ని అక్కడ చెల్లించిన తరువాతే ఇసుక లోడ్ అవుతుంది. ఈ పరిస్థితి బోధన్ శివార్లలోని ఖండ్ గావ్, సిద్ధాపూర్ లోని మంజీర ప్రాంతంలో ఉండగా, ఆ ముగ్గరు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరుడైన మాజీ సర్పంచ్ తోపాటు మరో ఇద్దరు అని ఆ ప్రాంత వాసులు తెలిపారు.
ఎమ్మెల్యే అనుచరులైన ఆ ముగ్గురు నడుపుతున్న ఇసుక దందాకు సంబంధించిన వివరాలు స్థానికులు, ఇసుక వ్యాపారులు తెలిపిన పరకారం ఇలా ఉన్నాయి. బోధన్ శివారులోని ఖండ్ గావ్, సిద్దాపూర్ ప్రాంతాల్లో మంజీరాలో ఇసుక తవ్వకాలకు అనుతులు ఉండడంతో వ్యాపారులు నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి రూ.4,500 డీడీ చెల్లించి వే బిల్లు ద్వారా ఇసుక కోసం క్వారీ వద్దకు వెళ్తే అక్కడ ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించింది పక్కన పెట్టాలని, ఒక్కో టిప్పర్ కు రూ.6,300 చొప్పున చెల్లించాలని తెగేసి చెబుతున్నారు. దీంతో చేసేది లేక ఇసుక వ్యాపారులు టిప్పర్ కు రూ.6,300 చొప్పున అనధికారికంగా చెల్లిస్తున్నారు. అయితే టిప్పర్ లో జేసీబీతో ఒక బకెట్ ఇసుక అదనంగా నింపేందుకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్క టిప్పర్ ఇసుక ధర రూ.11,800కు చేరుతోంది. టిప్పర్ వెనకాల రూ.7,300 వరకు వసూలు చేస్తున్నారు. ఈ ప్రభావం ఇళ్ల నిర్మాణదారులపై పడుతోంది. వినియోగదారుల వద్దకు వచ్చేసరికి టిప్పర్ ఇసుక ధర విపరీతంగా పెరుగుతోంది. ఎమ్మెల్యే అనుచరులు అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నా, నదిలో జేసీబీలు పెట్టి ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసుశాఖలు కళ్లమూసుకుంటున్నాయి. నదిలో భారీ వాహనాలు నడుపుతుండడంతో అక్కడి వన్యప్రాణుల ఉనికికి ప్రమాదం ఏర్పడుతోంది.

అంతా బహిరంగమే అయినా పట్టింపులేదు
ఇసుక క్వారీల్లో ఎమ్మెల్యే అనుచరులు వసూళ్లకు పాల్పడుతున్నారనేది బహిరంగ విషయమే అయినప్పటికీ అటు ఎమ్మెల్యే, ఇటు అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు వ్యక్తులు ఏకంగా ప్రత్యేకంగా కౌంటర్ తెరిచి ఒక్కో టిప్పర్ వెనకాల రూ.7వేలకు పైగా వసూలు చేస్తున్నా పట్టించుకునే వారు కరుయ్యారు.


The tipper would be full if those three were okay.

More articles

Latest article