. ఇన్ఫర్మేషన్ ఫర్ సేల్.. నిఘా సంస్థల నయా ట్రెండ్
. అధికారులకు తప్పుడు నివేదికలు
. ఫలితంగా ఉత్తుత్తి విచారణలు. . చర్యలు శూన్యం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసుశాఖకు ఆయువు పట్టులాంటి నిఘా విభాగాల్లో ఏళ్ల తరబడి కుర్చీలకు అతుక్కుపోయిన కొందరు ముదుర్లు ‘ఇన్ఫర్మేషన్ ఫర్ సేల్..’ అంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇల్లీగల్ దందాలకు వెన్నుదన్నుగా నిలుస్తుండడంతోపాటు కాన్ఫిడెన్షియల్ డాటానూ ఇతరులకు చేరవేస్తున్నారని శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. నిఘా విభాగాల్లోని కిందిస్థాయి నుంచి వచ్చే నివేదికలు లోపభూయిష్టంగా ఉంటుండడం జిల్లా పోలీసింగ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరాయి. రాష్ర్టంలో అసాంఘిక కార్యకలాపాలు, ఇల్లీగల్ దందాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే కారణంతో పోలీస్ బాస్ 13 మందిపై వేటు వేశారు. కానీ ఉమ్మడి జిల్లాలో ఒక్కరూ కూడా లేరని, ఇంటలిజెన్స్, ఎస్ బీ వర్గాల నిఘా వైఫల్యమే అందుకు కారణమని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
బాస్ ల కన్న ముందే రంగ ప్రవేశం..
నిఘా విభాగాల్లో ఏళ్ల తరబడి కుర్చీలకు అతుక్కుపోయిన కొందరు ముదుర్లు ఇల్లీగల్ దందాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తమ బాస్ ల కన్న ముందే రంగ ప్రవేశం చేస్తూ సమాచారాన్ని అందులో ప్రమేయం ఉన్న వారికి చేరవేస్తున్నారు. ఇక విచారణ విషయానికి వచ్చే సరికి తప్పుడు నివేదికలు ఇచ్చేయడం మామూలే అనే విమర్శలు అనేకం. ఇక విజిలెన్స్ విచారణ అనేది పోలీస్ శాఖలో ఉండకపోవడం, ఇంటలిజెన్స్ ద్వారా తెచ్చుకునే నివేదికలు లోపభూయిష్టంగా ఉండటంతో దాని ప్రభావం ఉమ్మడి జిల్లాలోని పోలీసింగ్ పై పడుతోంది.
ఇసుక.. పీడీఎస్ బియ్యం.. మట్కా, గుట్కా..
ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో ఇసుక రీచ్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని పోలీస్ బాస్ లు అంటున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో విస్తరించిన మంజీర పరీవాహక ప్రాంత పోలీస్ స్టేషన్ లతోపాటు ఇసుక అక్రమ రవాణా జరిగే ప్రాంతాల పోలీస్ స్టేషన్ లకు కాసుల వర్షం కురిపిస్తోంది. అందుకే మొక్కుబడిగా ట్రాక్టర్లు, టిప్పర్లు దొరికిన వాటిని తహసీల్దార్లతో జరిమానాకు పరిమితం చేస్తున్నా మైనింగ్ శాఖకు అప్పగించడంలేదు. ఇక ఉమ్మడి జిల్లాలో పీడీఎస్ దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. ఒక్క నిజామాబాద్ నగరంలోనే ప్రతి నెలా మామూళ్లు రూ.5 లక్షల చొప్పున ముట్టజెపుతున్నామని పీడీఎస్ మాఫియా బాహాటంగా చెబుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మట్కాదందా ఆన్ లైన్ లో ఊడల మర్రిలా విస్తరించింది. చిన్నాచితక మట్కా బీటర్లను తప్ప ప్రధాన ఏజెంట్లను పట్టుకున్న పాపాన పోలేదు. ఇక గుట్కా దందా మళ్లీ జిల్లాలో వేళ్లూనుకుంది. నిజామాబాద్ కు చెందిన ప్రముఖులకు గుట్కా ఫ్యాక్టరీలు ఉండటంతో రవాణా, వినియోగం, విక్రయాలు ఆగడం లేదు.
జీరో ఫైనాన్స్, బెట్టింగ్ లు..
ఇక జీరో ఫైనాన్స్ వ్యాపారులకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. ఆస్తులను కాజేస్తూ ప్రాణాలనూ హరిస్తున్నారు. అప్పు కావాలంటే ఆస్తులు ఎదుటి వ్యక్తి పేరుపై రిజిస్ర్టేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక రిజస్ర్టేషన్ చేసిన ఆస్తి తిరిగి వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. జీరో ఫైనాన్స్ దందా యథేచ్ఛగా సాగుతున్నా వ్యాపారులకు సంబంధించిన వివరాలు పోలీసు బాస్ వద్దకు చేరడం లేదు. ఆన్ లైన్ బెట్టింగ్ లో నిత్యం లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. యువత, వ్యాపారులు, ఉద్యోగులు సర్వస్వం పోగొట్టుకుని తమ ప్రాణాలను కోల్పోతున్నారు.
పత్తాలాట..
పత్తాలాట చిన్నపాటి కుటిరపరిశ్రమలా మారింది. పేకాట స్థావరాల నిర్వాహకులతో పోలీసులే కుమ్మక్కవుతున్నారనేందుకు అనేక ఉదాహరణలున్నాయి. పలుచోట్ల పోలీసుల అండదండలతో పేకాటస్థావరాలు కొనసాగుతున్నాయి. మరికొన్ని చోట్ల స్వతంత్రంగా పేకాటస్థావరాలు నడిపిస్తున్నవారిపైకి పోలీసులను పంపుతున్నారు. నెలానెలా మామూళ్లు ఇచ్చేవారే పోలీసులను శాసిస్తుండడం విశేషం.
లూప్ లైన్ ను భ్రష్టుపట్టిస్తూ..
నిఘా సంస్థల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది పేరుకు లూప్ లైన్ అయినా దానిని కూడా భ్రష్టు పట్టించారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వం, పోలిస్ యంత్రాంగం ఆధారపడేది నిఘా వర్గాల సమాచారంపైనే.. అయితే సంబంధిత సమాచారాన్ని పోలీస్ బాస్ లకు ఇవ్వకముందే అధికార పక్షానికి, వీలైతే ప్రతిపక్షానికి చేరవేశారనేది బహిరంగ రహస్యం. అంతే కాకుండా పొలిటికల్ వర్గాలకు అనుకులంగా లేని వారి ఫోన్ డాటాను తీసుకువెళ్లి స్వామి భక్తిని ప్రదర్శించిన ఘనత నిఘా వర్గాలది. ఇక పోలీస్ శాఖలో కొందరు అధికారులు సివిల్ పంచాయితీలు మొదలుకొని ఇల్లీగల్ దందాల విషయంలో ఫిర్యాదులు ఉన్నా.. వాటిపై విచారణ అంతా తప్పుల తడకగా ఇవ్వడం వారికే చెల్లిందనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాకు పొరుగునే ఉన్న మహరాష్ర్ట, కర్నాటక సరిహద్దులు కేంద్రంగా ఇల్లీగల్ దందాల్లో పోలీసుల ఇన్ వాల్వ్ మెంట్ ఉన్నా ఇప్పటి వరకు ఒక్కరిపై వేటు పడలేదంటే ఇంటలిజెన్స్, ఎస్బీ వర్గాల చల్లని చూపే అని చెప్పాలి. ఏదైనా విషయంలో ఇంటలిజెన్స్ వర్గాల విచారణ అంశం గోప్యంగా ఉంచాల్సిన చోట వారే లీకులు ఇచ్చి దానిని సొమ్ము చేసుకుంటున్నారని అందులో కొందరు ఆయా విభాగాల్లో ఏళ్ల తరబడి తిష్టవేసిన అనుభవమే కారణమని చెప్పొచ్చు. ముదుర్లుగా ముద్రపడే వరకు వారిని కదపక పోవడమే జిల్లాలో ఎస్బీ, ఇంటలిజెన్స్ విభాగాల్లో అవినీతి ఆరోపణలు పెరగడానికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.