29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మంజీరాను చెరబట్టిన ఇసుక మాఫీయా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇసుక తరలింపునకు నదిలో కిలోమీటర్ల కొద్ది రోడ్డు

 

. . . పగలు తవ్వకాలతో నది ఒడ్డున డంపింగ్… రాత్రి వేళ టిప్పర్ ల తో తరలింపు

 

. . . సరి హద్దులు దాటుతున్న తెలంగాణ ఇసుక

 

. . . ఇందిరమ్మ ఇండ్ల కోసం అని తవ్వకాలు… మహారాష్ట్రకు తరలింపు

 

నిజామాబాద్, బతుకమ్మ:

 

తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దుల్లోని మంజీరా నదిని ఇసుకాసురులు చెరబట్టారు. నదిని నిట్ట నిలువునా తవ్వేస్తున్నారు. భారీ వాహనాల ద్వారా ఇసుకను తరలించేందుకు నది మధ్యలో అయిదు కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మించారు. తవ్విన ఇసుకను గుట్టలుగా పేర్చి ప్రభుత్వ అనుమతుల పేరిట అక్రమ రవాణాకు తెరలేపారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇసుక క్వారీలు నడుస్తుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తిచూడటం లేదనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు ఎక్కడా లేని స్వేచ్ఛ నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తోంది. మరో పక్క ఇసుక రవాణా సమయంలో అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

 

The sand mafia that captured Manjeera

 

తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లో నిజామాబాద్ జిల్లాను ఆనుకుని ఉన్న మంజీరా నది జీవం కోల్పోతోంది. పోతంగల్ మండలంలోని మంజీరా నది పరీవాహక ప్రాంతంలో మూడు క్వారీల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అధికార పార్టీ నేతలు కనుసన్నల్లో ఈ క్వారీలు నడుస్తున్నాయి. పోతంగల్ గ్రామ పరిధిలోని ఓ క్వారీ భారీ సినిమా సెట్టింగును తలపిస్తోంది. నది ఒడ్డున ఇసుకను గుట్టలుగా పేర్చారు. క్వారీ నుంచి నిత్యం 250 లారీల రాకపోకలు సాగిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఒకే గ్రామ పరిధిలో మూడు క్వారీలకు అనుమతులు ఇవ్వడంతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంజీరా వంతెన వద్ద రైతులు వేసుకున్న రోడ్డు ఇసుక లారీల రాకపోకలతో ధ్వంసం అయ్యింది. పలు చోట్ల భారీ గుంతలు ఏర్పడ్డాయి. నిబంధనలకు పాతరేస్తూ.. అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి ఇసుక వాహనం డీ కొని ఓ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందంటూన్నారు వైద్యులు. ప్రభుత్వ అనుమతి పేరుతో జరుగుతున్న ఇసుక రవాణాకు చెక్ పెట్టాలని పొతంగల్ గ్రామస్తులు కోరుతున్నారు. మంజీరా నది పరివాహాకంలో అడ్డగోలు ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బయట చూడటానికి ఆన్ లైన్ బుకింగ్ తోనే ఇసుక తీసుకెళ్తున్నా  తెరచాటున మాత్రం అక్రమ దందా నడుస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేరిట వే బిల్లులు తీసుకుని  వాటి ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో వీటికి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా స్థానిక రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ ఇళ్ళు, రోడ్లు, భవనాల నిర్మాణాల పేరిట ఇసుక అనుమతులు జారీ చేస్తున్నారు. అవి కూడా ఏ రోజుకారోజు ఇవ్వాల్సి ఉండగా కొందరికి రోజుల తరబడి రాసిస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని మంజీర నదిని నిలువునా తోడేస్తున్నారు. ఒక్కో చోట 20 నుండి 40 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిగాయి. నది గర్భంలోకి వెళ్లి మరీ తవ్వకాలు సాగిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు అధికారిక క్వారీలు నిర్వహిస్తుండగా.. రాత్రి వేలల్లో అక్రమ ఇసుక తరలింపు కొనసాగుతోంది. టీఎస్ఐఎండీసీ ఆధ్వర్యంలో ఈ ఇసుక కేటాయింపులు చేస్తుండగా.. అధికారుల పర్యవేక్షణ కరువైంది. రెవెన్యూ-టీఎస్ఐఎండీసీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా.. ఇసుక వ్యాపారులు అడ్డగోలుగా తవ్వేస్తూ… నిబంధనలకు పాతర వేస్తున్నారు. పోతంగల్ మండలంలోని కొడిచెర్ల, ఖరేగాం, పోతంగల్ ఈ 3 చోట్ల నుండీ ఇసుకను అడ్డగోలుగా తరలిస్తున్నారు.

 

The sand mafia that captured Manjeera

 

పోతంగల్ గ్రామం నుండి ఒక కిలోమీటర్ దూరంలో మంజీర నది పై వంతెన ఉంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర సరిహద్దు మొదలవుతుంది. వంతెన నుంచి సుమారు 5 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఈ క్వారీ కనిపిస్తోంది. ఇక్కడ తవ్వుతున్న ఇసుకను రేయింబవళ్లు వందలాది వాహనాల ద్వారా బయటకు తరలిస్తున్నారు. ప్రతీరోజు సుమారు 250 లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రవాణా కోసం అక్రమార్కులు ఏకంగా నది మధ్యలో రోడ్డు నిర్మించారు. మంజీర నదిలో తవ్వి తీస్తున్న ఇసుక బోధన్ మార్గంలో హైదరాబాద్ వరకు తరలిపోతోంది. వీటిని ఎవరూ అడ్డుకోకుండా పోలీసు,  రెవెన్యూ,  మైన్స్ శాఖల అధికారులు అండగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల వందలాది లోడుల ఇసుక డంపులు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ఇసుక వాహనాల వల్ల చుట్టు పక్కల గ్రామాల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు దెబ్బతింటున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో సాధారణ రాకపోకలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఐతే వారి వేదన అరణ్య రోదనలా మారుతోంది..ఇసుక క్వారీలు.. నిజామాబాద్ జిల్లా అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఓ ముఖ్య నేత కనుసన్నల్లో ఈ దందా నడుస్తోంది. ఇసుక అక్రమ దందా పై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నదులను నిర్జీవం చేస్తూ  పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్న ఈ ఇసుక తోడేళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్ధులు కోరుతున్నారు. టీఎస్ఐఎండీసీ చైర్మన్ సొంత జిల్లాలో మంజీరా నదిని చెరపట్టి తవ్వకాలు చేస్తున్న ఇసుక వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకుంమటారో వేచి చూద్దాం.

 

The sand mafia that captured Manjeera

More articles

Latest article