నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బుధవారం నిర్మల్ న్యాయస్థానం పరిధిలో అడ్వకేట్ పి. అనిల్ కుమార్ వృత్తి పరమైన విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీసు సిబ్బంది ఆయన వాహనాన్ని న్యాయస్థాన ప్రాంగణంలో ధ్వంసం చేయడం, ఆయన విధులకు అడ్డంకులు కలిగించడం అత్యంత తీవ్రమైన, చట్ట విరుద్ధమైన చర్యగా న్యాయవాద పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుందని పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సంఘటన న్యాయవాదుల గౌరవం, వృత్తి స్వాతంత్ర్యంపై ప్రత్యక్ష దాడిగా భావిస్తున్నామన్నారు. కోర్టు ప్రాంగణంలో పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం న్యాయ వ్యవస్థకు అవమానం అన్నారు. న్యాయవాదుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, న్యాయవాదుల ఐక్యతను బలోపేతం చేయడానికి, బాధిత న్యాయవాదికి మానసిక మద్దతుగా న్యాయవాద పరిషత్ నిలుస్తుందని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని కోర్టు ప్రాంగణంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పరిషత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని తెలిపారు. న్యాయవాదుల వృత్తి స్వాతంత్ర్యాన్ని కాపాడేలా కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. కోర్టు ప్రాంగణాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని, రక్షణ చట్టం తక్షణమే ప్రభుత్వం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
