- పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు మహిళల కుస్తీలు
- నిజామాబాద్ పోస్టాఫీసులో జుట్టుపట్టి కొట్టుకున్న మహిళలు
- ఎక్స్ లో పోస్టు చేసిన మాజీ మంత్రి కేటీఆర్
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగితే అమలు చేస్తామన్న ఆరు హామీల్లో ఒకటైనా మహాలక్ష్మీ పథకం ప్రారంభానికి ముందే మహిళల మధ్య కొట్లాటలు పెడుతుంది. ప్రభుత్వం ఇది వరకు 500కు గ్యాస్ బండ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం లాంటి పథకాలను అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల యువ వికాసం కోసం దరఖాస్తులు తీసుకుని పరిశీలన తర్వాత దానిని అటకెక్కించిన విషయం విధితమే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో ప్రధానమైన మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ.2500 చెల్లించనుందన్న ప్రచారం జోరందుకుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మహిళలకు ప్రతి నెల రూ.2500లు చెల్లిస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గత వారం రోజులుగా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు మహిళలు పోటీపడుతున్నారు. ప్రభుత్వం ఏదైనా ఖాతా ఉన్న మహిళలకు మాత్రమే మహాలక్ష్మీ పథకం కింద రూ.2500 చెల్లిస్తుందని ప్రచారం జరిగింది. దానితో మహిళలు బ్యాంకుల కన్నా సమీపంలోని పోస్టాఫీసుల్లో ఎలాంటి రుసుం లేకుండానే ఖాతాలు తెరుస్తున్నారని అక్కడికి క్యూలు కట్టారు. పోస్టాఫీసుల్లో సాధారణ లావాదేవిల సంగతి దేవుడెరుగు కానీ ఇప్పుడు ఖాతాలు తెరిచేందుకే మహిళలు గంటల కొద్ది క్యూలలో నిలుచుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాల కార్యాలయం వద్ద మొదటి అంతస్తులో కొత్త ఖాతాలను తెరిచే కార్యక్రమాన్ని పోస్టల్ అధికారులు శ్రీకారం చుట్టారు. కానీ అక్కడ మహిళలు ఓపికలు నశించి గొడవలు పడే స్థాయికి చేరుకున్నారు. వారు ఖాతాలు తెరిచేందుకు గాను పోటీ పడి క్యూలైన్ లలో పోటీ పడుతున్నారు. గురువారం అక్కడ ఇద్దరు మహిళలు వరుసలో నిలుచుండే విషయంలో గొడవ పడి జుట్టు పడి కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ లో పోస్టు చేశారు. నిన్నటి వరకు ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డల మధ్య కొట్లాట పెట్టావు, ఇప్పుడు మహాలక్ష్మీ పేరిట మభ్యపెట్టి జుట్టుపట్టి కొట్టుకునేలా చేశావని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన పోస్టు వైరల్ గా మారింది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బ్యాంకుల్లో కంటే పోస్టల్ డిపార్ట్ మెంట్ లోనే ఖాతాలు తెరిచేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకుల్లో అయితే జీరో అకౌంట్ తీసేందుకు సవాలక్ష నిబంధనలు ఉండడంతో మహిళలు పోస్టాఫీసుల్లోనే అకౌంట్లు ఓపెన్ చేసేందుకు క్యూలు కడుతున్నారు. ప్రతి నెల పోస్టాఫీసు ద్వారా వృద్దులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి ఉన్న కౌంటర్ ల వద్ద మహిళలు ఖాతాలు తెరిచేందుకు రోజు వందల మంది వస్తుండడంతో పోస్టల్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదీ చాలదన్నట్లు ఇటీవల కాలంలో ప్రభుత్వం రైతులకు ఇచ్చే రుణమాఫీ 70 వేల మంది రైతులకు పోస్టల్ ఖాతాల ద్వారానే చెల్లింపులు చేస్తుండడంతో వారు కూడా పోస్టాఫీసుల వద్ద క్యూలు కడుతున్నారు. దానితో పోస్టాఫీసుల వద్ద మహిళల పడిగాపులు, గొడవలు నిత్యకృత్యంగా మారాయి.
