- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
- పెండింగ్ పనులపై ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ పట్టణాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అంకిత్ తో కలిసి విద్యుత్, మున్సిపల్ అధికారులు, ఆర్అండ్‌బి, హౌసింగ్, పంచాయతీ రాజ్ తదితర శాఖల ఇంజినీరింగ్ అధికారులతో డబుల్ బెడ్ రూం ఇళ్ల అసంపూర్తి పనులు, ఇతర పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్బన్ ఏరియాలలో పెండింగ్‌లో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిధులు అందుబాటులో ఉన్నందున, విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న కల్వర్టులు, రోడ్లు, వంతెనల పనులను వేగవంతంగా జరిపించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఒక్కో పని వారీగా పనుల ప్రగతిని కలెక్టర్ సమీక్షిస్తూ, అధికారులకు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలలో అదనపు తరగతి గదులు, టాయిలెట్స్ పనులు, అదనపు కలెక్టర్ల నివాస బంగ్లాలు ఇత్యాది భవన నిర్మాణాలు వేగంగా పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. న్యాయాధికారుల భవనాలకు, ఆర్ అండ్ బీ అతిథి గృహంకు మరమ్మతులు నాణ్యతతో చేపట్టి గడువు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. జీ జీ హెచ్ ఆసుపత్రిలో లీకేజీలు, ఫ్లోరింగ్, కిటికీల అద్దాల మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులు కార్యస్థానాల్లో ఉంటూ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమీక్షలో సంబంధిత శాఖల ఈ.ఈ లు, డీ.ఈలు, ఏ.ఈలు పాల్గొన్నారు.

