-సమయానుకూలంగా పరిష్కరించుకోవడమే మేలు
-ఇరు పక్షాల కక్షిదారులకు సమన్యాయం
.. జిల్లా జడ్జి భారత లక్ష్మీ
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ
న్యాయస్థానాలలో న్యాయ వివాదాలు పరిష్కారం కావడానికి సమయం పడుతుంది కానీ ఇరు పక్షాలు రాజీ పద్దతిన పరిష్కరించుకుంటే సత్వరమే లోక్ అదాలత్ అవార్డులు జారీ చేస్తుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోర్టు లో శనివారం సహచర అదనపు జిల్లాజడ్జిలు హరీష, సుగాలి నారాయణ, దారావత్ దుర్గా ప్రసాద్, అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్,బార్ అధ్యక్షులు నీలకంఠ రావు, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రకాష్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా .. జిల్లా జడ్జి భారత లక్ష్మీ కక్షిదారు నుద్దేశించి ప్రధానోపన్యాసం చేస్తు….సమయాన్ని, డబ్బును ఆదా చేసుకుని వాటిని ఇతర పనులకు మల్లించవచ్చని తద్వారా కోర్టులు ఆ సమయాన్ని ఇతర న్యాయ వివాదాల వైపు మళ్లించి మంచి మంచి తీర్పులు త్వరితగతిన రావడానికి ఆస్కారం ఉంటుందని ఆమె వివరించారు.స్థానికంగా ఒక కోర్టులో గెలిచిన వారు పై కోర్టులకు అప్పీలుకు వెళతారని మల్లి న్యాయవాదులు వాదనలు, దిగువ కోర్టు తీర్పు పరిశీలనలు, డాక్యుమెంట్ అధ్యయనం చేసిన అనంతరం న్యాయమూర్తులు తీర్పులు వెలువరిస్తారని ఆమె వివరించారు.సుధీర్ఘకాలపు న్యాయ విచారణ లో న్యాయం సమపాళ్లలో ఉంటుందని కానీ రాజీ చేసుకుని లోక్ అదాలత్ ద్వారా తక్కువ సమయకాలంలో పరిష్కరించుకోవడం లో ఉన్న ఆనందానికి, సంతోషానికి అవధులు ఉండవని ఆమె ఉద్భోదించారు.జాతీయ లోక్ అదాలత్ లో జాతి జనుల శ్రేయస్సు ఇమిడి ఉన్నదని అన్నారు.ఒక మహా యజ్ఞంలా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని అందుకు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ భాగస్వాముల చేయూత మరువలేనిదని పేర్కొంటూ అందరికీ అభివాదాలను జిల్లా జడ్జి భారత లక్ష్మీ తెలిపారు.

నేటి జాతీయ లోక్ అదాలత్ విజయం వెనుక భాగస్వామ్య పక్షాల మద్దతు, సహాయ సహకారాలు దండిగా ఉన్నాయని ఆమె తెలిపారు.మొదటి అదనపు జిల్లా జడ్జి హరీష మాట్లాడుతూ కోర్టు తీర్పు లో ఒక పక్షం గెలుస్తుందని కాని లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవడం వలన ఇరు పక్షాల గెలుపు ఉంటుందని అన్నారు.మోటారు రోడ్డు ప్రమాద నష్ట పరిహార కేసులో రాజీ పద్దతిన దావాలు పరిష్కరించుకుంటే వెంటనే భీమా కంపెనీలు డబ్బులను కోర్టులో డిపాజిట్ చెస్తాయని అవి బాధితులకు అందుతాయని రెండవ అదనపు జిల్లాజడ్జి సుగాలి నారాయణ వివరించారు.నాల్గవ అదనపు జిల్లా జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ ప్రసంగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నామని అందుకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నాల్సా కు ధన్యవాదాలు తెలిపి నాల్సా కల్పించిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని అన్నారు.అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రసంగిస్తూ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చేపడుతున్న ప్రతి కార్యక్రమంలో జిల్లా అధికార యంత్రాంగం బహుముఖ భూమికను నిర్వహిస్తున్నదని తెలిపారు. నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ లో దాదాపు 4053 రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కారం దిశగా కదిలించినట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ అధికారులను మమేకం చేసుకుని న్యాయ సేవా సంస్థ కార్యక్రమంలో భాగస్వాములు అయినామని ఆయన అన్నారు.నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ విజయంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి చైతన్య అంగరి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు వడ్డీ హరి కుమార్, పాముజుల శ్రీనివాస్ రావు, కీర్తి రాజ్, బీమా కంపెనీల న్యాయవాదులు సధానంద్ గౌడ్, దయానంద్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు ఆనంద్ రెడ్డి,మధుసూదన్ రావు,అల్గొల్ రవీందర్, మద్దేపల్లి శంకర్,ఆశా నారాయణ,జగన్ మోహన్ గౌడ్, రవి ప్రసాద్,చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు.
-కోటి పది లక్షల రోడ్డు ప్రమాద నష్ట పరిహార దావా అవార్డు.
జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా మోటారు రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ ప్రతాప్ సింగ్ బాధిత కుటుంబ సభ్యులు దాఖలు చేసిన దావాలో వారి న్యాయవాది అల్గొల్ రవీందర్, టాటా ఎఐజి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ మేనేజర్ కొమ్ము కిరణ్ ల రాజీ ప్రతిపాదన మేరకు ఒక కోటి పది లక్షలకు లోక్ అదాలత్ అవార్డు జారీ చేశారు. జిల్లా జడ్జి భారత లక్ష్మీ ఆ మేరకు బ్యాంక్ చెక్ ను రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రతాప్ సింగ్ భార్య రాథోడ్ కౌసల్య, కుమారులు రాథోడ్ దీపక్,రాహుల్ లకు అందజేశారు.

-హైకోర్టు లో అప్పీలు ఉండగా మరొక కేసుకు లోక్ అదాలత్ అవార్డు జారీ
సీనియర్ న్యాయవాది దాదన్నగారి మధుసూదన్ రావు దాఖలు చేసిన ఒక మోటారు రోడ్డు ప్రమాద నష్ట పరిహార కేసు జిల్లా కోర్టు తీర్పు చెప్పిన అనంతరం ఐసిఐసిఐ బీమా కంపెనీ జిల్లా కోర్టు ఎక్కువ మొత్తంలో నష్ట పరిహారం అందజేయాలని తీర్పు చెప్పిందని హైకోర్టులో అప్పీలు చేసింది. అప్పీలు విచారణ దశలో ఉండగా రాజీ పద్ధతిలో పది లక్షలు చెల్లించడానికి ఒప్పుకోవడంతో లోక్ అదాలత్ అవార్డు జారీ చేసింది
