29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

హక్కుల నేత అస్తమయం

Must read

📰 Generate e-Paper Clip

 సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాదవరావు కన్నుమూత

 పరిశోధన కోసం భౌతిక కాయం మెడికల్ కాలేజ్ కు అప్పగింత

నిజామాబాద్, బతుకమ్మ:  మానవ హక్కుల నేత గొర్రెపాటి మాధవ రావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్టీ (మానవ హక్కుల వేదిక ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షులు) సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవ రావు (67)  ఉదయం గుండె జబ్బుతో తుది శ్వాస విడిచారు. భౌతికకాయం ప్రజల సందర్శనార్థం ఆయన స్వగృహం ఎల్లమ్మ గుట్ట నిజామాబాద్ నందు ఉంచారు. మాదవ రావు భౌతికకాయాన్ని (ఆదివారం) ప్రభుత్వ మెడికల్ కళాశాల నిజామాబాద్ వారికి విద్యార్థుల పరిశోధనల కోసం అందజేయడం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రగతి హాస్పిటల్ నందు ఆయన నేత్రాలను లయన్స్ క్లబ్ వారికి అందచేయనున్నారు. తాను చనిపోయిన తన కళ్ళు ఇతరులకు ఉపయోగపడాలని తాను బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పే వారని ఆయన కోరిక మేరకు లయన్స్ క్లబ్ వారికి నేత్రాలను ఇవ్వడం జరిగింది.

మానవ హక్కుల యోధుడు గొర్రెపాటి మాధవ రావు మార్చ్ 4, 1957 న శకుంతలమ్మ, కోటేశ్వర రావు దంపతులకు  ఉమ్మడి రాష్ట్రంలోని గుంటురు జిల్లా లోని గుర్నాథ పాలెంలో జన్మించారు. మొత్తం ఆరుగురు అన్నదమ్ములలో మాదవరావు మూడవ వాడు.  వారి తల్లిదండ్రులు 1957 జూన్ లో  తెలంగాణ కు వలస వచ్చి బస్వాపూర్ గ్రామంలో స్థిరపడ్డారు.  బాల్యం ప్రాథమిక విద్యాభ్యాసం ఎత్తొండలో, హై స్కూల్ విద్య కోటగిరి లో జరిగింది. అక్కడే  పిడిఎస్ యు నిర్మాత  జంపాల చంద్రశేఖర్ ప్రసాద్(జేసిఎస్)తో పరిచయం అయ్యింది. తర్వాత ఇంటర్మీడియట్ విద్య బాన్సువాడ లో జరిగింది. ఆ సందర్భంలోనే ప్రగతిశీల ఉద్యమాల గురించి నిరంతరం చర్చించేవారు. తదనంతరం ఉన్నత విద్య కోసం హైదరాబాద్ సిటీ కాలేజీ లో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ లో లా విద్యను అభ్యసించారు. అదే సమయంలో ప్రగతిశీల ఉద్యమాలలో భాగస్వామి అయ్యారు. పిడిఎస్ యు మాస పత్రిక విజృంభణ, సిసిఐ (ఎంఎల్ )పక్ష పత్రిక విమోచన  పత్రికలకు సంపాదక వర్గంగా  3 సం ల పాటు పూర్తికాలం పనిచేసారు. తదనంతరం కొంతకాలం టాక్స్ కన్సల్టెంట్ గా పనిచేసి. ఆ వృత్తిని వదిలేసి 1982 లో నిజామాబాద్ చేరి లా ప్రాక్టీసు మొదలుపెట్టారు. అనేక ఉద్యమ  కేసులను ఉచితంగా వాదించారు.

The leader of rights has fallen

తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉచితంగా వాదించి ఉద్యమానికి సహకారంగా ఉన్నారు. దేశంలోనే చరిత్ర కెక్కిన సంఘటన ఆయన  లాయర్ గా మూడు  పోలీసు ఎన్కౌంటర్ లలో  పోలీసు లపై , ప్రభుత్వం పై కేసు లను వేసి గెలిచి న్యాయస్థానం తీర్పుతో బాధితులకు ప్రభుత్వం ద్వారా  నష్టపరిహారం అందించారు.( దేశంలో సంచలనం సృష్టించిన కేసు ఇది బూటకపు ఎన్కౌంటర్ అని తేల్చారు).  మరొక వ్యక్తిని దొంగతనం కేసులో పట్టుకొని పోలీసు లు  బూటకపు ఎన్కౌంటర్ చేస్తే బాధితుల తరపున కేసు వాదించి గెలిచారు. లక్ష రూపాయలు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇస్తే ప్రభుత్వం  పై కోర్టు కు వెళ్ళినా అక్కడా గెలిచి బాధితులకు పరిహారం అందేలా చేశారు. ద్వారకా నగర్ నిజామాబాద్ గుడిసె వాసుల  పట్టాల కోసం వారి తరపున కేసులు వాదించి గెలిచారు. శ్రామిక నగర్ గూడెం భూముల పట్టాల కోసం కేసు వేసి గెలిచారు. కోటగల్లి వాసుల పక్కా ఇళ్లు పోరాటంలో వారికి మద్దతు తెలిపి కేసు వేసి పట్టాల సాధనలో ముఖ్య పాత్ర పోషించారు. ఉద్యమకారులపై పెట్టిన ఔరంగాబాద్ కుట్ర కేసు వాదించి గెలిచారు. రాజ్య హింస ఎక్కడ జరిగినా ఎదిరించటంలో ముందు ఉండేవారు.

కేసులు వాదించటంలో అందె వేసిన చెయ్యి. వాదించిన చాలా కేసు లు తన అపార ప్రతిభతో గెలిచారు. తన ప్రతిభకు కోర్టు లో ప్రభుత్వ ప్లీడరు గా అవకాశం వచ్చినా తిరస్కరించి నేను నిరంతరం బాధితుల తరపున వాదిస్తానని అన్నారు. తన వృత్తి తో పాటు నిరంతరం ప్రజా ఉద్యమాలకు సహకరిస్తూ వచ్చారు. అందులో భాగంగా హక్కుల ఉద్యమంలో పని చేశారు. పౌరహక్కుల సంఘం లో చేరి జిల్లా అధ్యక్షులు గా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా 1983 నుంచి 96 వరకు పని చేసారు. మరో హక్కుల నేత బాలగోపాల్ తో  కలిసి 2004 నుంచి  మానవహక్కుల వేదికలో భాగస్వామ్యం అయ్యి రాష్ట్ర అధ్యక్షులుగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర మొదటి అధ్యక్షుడిగా 2019 నుంచి పనిచేసి 2023 లో రిలీవ్ అయ్యారు.  హక్కుల హననం జరిగిన ప్రతి చోటా నిజనిర్ధారణ చేసి రిపోర్ట్ లు రాశారు. నిజామాబాద్ లో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ స్మృతిలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ కి మేనేజింగ్ ట్రస్టీ గా ఉన్నారు. అనేక పత్రికలకు వ్యాసాలు, పుస్తకాలు రాశారు.  అనేక ప్రజా సంఘాల కార్యకర్తలకు తరగతులు బోధించారు. తెలంగాణ యూనివర్సిటీ లో మొదటితరం  న్యాయశాస్త్ర విద్యార్థులకు తరగతులు బోధించారు. నిజామాబాద్ లో మెడికల్ కళాశాలకు పార్థివ దేహాలను ఇవ్వటంలోనూ, అవయవ దానం చేయించటంలోనూ ముఖ్య పాత్ర పోషించారు.

The leader of rights has fallen

More articles

Latest article