. . . నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పోలియో రహిత సమాజ నిర్మాణమే మన ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం నిజామాబాద్ నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ర్యాలీలో “నిండు జీవితానికి రెండు చుక్కలు”, “మనందరి పంతం.. పోలియో అంతం” వంటి నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీ బస్టాండ్, తిలక్ గార్డెన్ చౌరస్తా మీదుగా డీఐఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కల మందు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూన్ 28 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో బూత్‌లలో చిన్నారులకు చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు. బూత్‌కు రాని చిన్నారుల కోసం జూన్ 29, 30 తేదీలలో ఇంటింటి సర్వే నిర్వహించి పోలియో చుక్కలు అందిస్తామని చెప్పారు. అనంతరం పోలియో నిర్మూలనపై అవగాహన పోస్టర్లను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు.

ర్యాలీ అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రెస్‌మీట్ నిర్వహించి కార్యక్రమ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు చిన్నారుల సంఖ్య 1,91,883 ఉండగా, వారి కోసం మొత్తం 1007 పోలియో బూత్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 241, గ్రామీణ ప్రాంతాల్లో 766 బూత్‌లు, 37 ట్రాన్సిట్ బూత్‌లు, 37 మొబైల్ బూత్‌లు ఏర్పాటు చేశామని వివరించారు. కార్యక్రమ నిర్వహణ కోసం 101 పర్యవేక్షణ అధికారులు, 4277 బూత్ సభ్యులు, 428 మంది ఆరోగ్య కార్యకర్తలు, 1112 ఆశా కార్యకర్తలు, 1501 అంగన్‌వాడీ కార్యకర్తలను నియమించినట్లు తెలిపారు. మొత్తం 2,11,100 పోలియో డోసులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మారుమూల ప్రాంతాలు, తాండాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, మురికివాడలు, హై రిస్క్ ప్రాంతాల్లో నివసించే చిన్నారులు ఎవరూ తప్పిపోకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో బూత్ స్థాయి నుంచి గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, డీఐఓ డాక్టర్ అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సికందర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ నవ్య, డాక్టర్ వెంకటేష్ తదితర వైద్య అధికారులు, సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.
