24 C
Hyderabad
Sunday, August 2, 2026

క్లబ్ లను మరిపిస్తున్న పత్తాలాట

Must read

📰 Generate e-Paper Clip

  • పొలిటికల్ పార్టీల లీడర్లే ఆర్గనైజర్లు ఐతే
  • అర్బన్ లో జోరుగా పేకాట అడ్డాలు
  • రోజూ చేతులు మారుతున్న లక్షల రూపాయలు
  • టాస్క్ పోర్స్ లేకపోవడంతో జోరుగా సాగుతున్న జూదం

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో పత్తాలాట క్లబ్ లను మించిపోయింది. అధికారికంగా క్లబ్ లకు అనుమతి లేకున్న పొలిటికల్ పార్టీల లీడర్లే ఆర్గనైజర్లు గా అవతారం ఎత్తి మరీ పేకాట ఆడిస్తున్నారు. జిల్లాలో టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు పత్తాలాట కోసం దెగ్లూర్, ధర్మాబాద్, బోరీకి వెళ్లిన వారు దానిని ఎత్తివేయడంతో అడ్డాలను ఇందూర్ సిటీకి మార్చారు. మొన్నటి వరకు గోవాకు ఒక్క ప్లంటర్ ను తీసుకువెళితే 30 శాతం కమీషన్ దక్కించుకున్న ఆర్గనైజర్లు జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల ఫాం హౌజ్ లలో జూదం అడ్డాలను నడుపుతున్నారు. దానితో నిత్యం లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన కొందరు కానిస్టేబుళ్ల ద్వార రైడింగ్ సమాచారం లీక్ అవుతుండటంతో జిల్లాలో స్టార్ హోటళ్ళలో జరిగిన పేకాట అడ్డాలపై పోలీసుల దాడులు నిష్పలమయ్యాయి. ఇప్పుడు వారే మళ్లీ పేకాటను గల్లీలలోకి ఫాం హౌజ్ లకు మార్చి మూడు ముక్కలు… 13 పత్తాలాటల (రమ్మి) ఆడిస్తున్నారు. ఒక్కొక్క ప్లేయర్ టేబుల్ క్యాష్ గా రూ.10 వేలు మొదలుకోని 1 లక్ష వరకు చూపిన వారిని ఆడించడం, అక్కడ కేటి పేరుతో తీసిన డబ్బుల ద్వారా నిత్యం ఒక్కొక్కరు లక్ష వరకు సంపాదిస్తున్నారు. పత్తాలాట ఆడేవారికి మందు, మంచింగ్ తో పాటు పోలీస్ రైడింగ్ అయితే బేయిల్ తో పాటు జరిమానా కుడా ఆర్గనైజర్ లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని ప్లేయర్ లను రప్పించి పత్తాలాట నిర్వహిస్తున్నారు. కేవలం మూడు నుంచి ఆరు నెలల్లోనే లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఆర్గనైజర్లు. పోలీసుల రైడ్ లో పట్టుబడిన వెనక్కి తగ్గకుండా పత్తాలాడించి పబ్బం గడుపుతున్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజా సమస్యలపై అధికార, ప్రతి పక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కానీ దందాల నిర్వహణలో మాత్ర భాయ్ భాయ్ గా చేస్తున్న విషయం తెలిసిందే. పత్తాలాట లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు ఆర్గనైజింగ్ లో కలిసి చేయడం గమనార్హం. నిజామాబాద్ నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కేసీఆర్ కాలనీ, గౌడ్స్ కాలనీ వద్ద అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల యువ నాయకులు ఆర్గనైజర్లుగా పత్తాలాట ఆడిస్తున్నారు. పైకి అగ్రోస్ ఎజెన్సీగా కలరింగ్ ఇచ్చి లోపల షెడ్డు లో పత్తాలాట ఆడించడం గమనార్హం. మొన్నటి వరకు పత్తాలాట ఎవ్వరికి వారు ఆడిన జిల్లా యువనేత, ఓ మాజీ కార్పోరేటర్ ఇప్పుడు కలిసి పత్తాలాట నిర్వహించడం విశేషం. గాజుల్ పేట్ గురుద్వార చౌరస్తా లో ఒక ఇంటిలో ఒక యువ నాయకుడు పత్తాలాట ఆడించడం గమనార్హం. కోటగల్లిలో మరో యువ మోర్చ నేత సైతం పత్తాలాటలోనే ఉపాధిగా మార్చుకున్నారు. కింద బీడీ కార్ఖానా పైనా పత్తాలాట నిర్వహిస్తు ఎవ్వరికి అనుమానం రాకుండా నడుపడం చేస్తున్నారు. పూసల గల్లిలో  ఎంట్రెన్స్ లో పైనాన్స్ లోపల పత్తాలాటలో అధికార పార్టీ యువ నేత నిర్వహణలు మూడు ముక్కలాట, రమ్మి జోరుగా సాగుతుంది. దుబ్బలో ప్రతిపక్ష పార్టీకి చెందిన  మాజీ కార్పోరేటర్ భర్త, యువనేత పత్తాలాట నిర్వహణలో నిమగ్నమయ్యారు. నగరంలోని మైనార్టీ ప్రాంతానికి చెందిన మజ్లీస్ పార్టీ కార్పోరేటర్ ఇదివరకు పత్తాలాటలో పోలీసులకు చిక్కిన వెనక్కి తగ్గకుండా జూదం ఆడిస్తున్నాడు. మాక్లూర్ మండలంకు చెందిన ఫేమస్ అర్గనైజర్ (మాజీ ప్రజా ప్రతినిధి భర్త) ఇప్పుడు ఫాం హౌజ్ ల పత్తాలాటలో బీజీగా ఉన్నారు. ఒకనాడు గోవా తో పాటు విదేశాలకు ప్లేయర్ లను తరలించి లక్షలు కూడబెట్టిన రుచిని మరువకుండా పత్తాలాటకు ఫాం హౌజ్ ను కేరాఫ్ గా మార్చారు.

More articles

Latest article