. . . ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పెట్రోల్, డీజిల్ ధరలను పది రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోందని రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాందేవ్ వాడ లోని పార్టీ కార్యాలయంలో ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రజలపై ఇంధన భారాన్ని మోపబోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆ భారాన్ని పూర్తిగా ప్రజలపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం కూలీలు, రైతులు, చిన్న వ్యాపారులు, ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి, పెట్రోల్ – డీజిల్‌ను జీఎస్టీ పరిధి లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజా సంఘాలతో కలిసి ఆర్‌ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందో ళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ నిజాముద్దీన్, దుబ్బాక కిషన్ లు పాల్గొన్నారు.
