నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కేంద్ర, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను విశ్లేషిస్తూ, మైనారిటీల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ 2026-27 సంవత్సరానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం ₹3,400 కోట్లని, గత ఏడాదితో పోలిస్తే ఇది కేవలం ₹50 కోట్లు మాత్రమే పెరిగిందన్నారు. దేశ మొత్తం బడ్జెట్ ₹50.65 లక్షల కోట్ల (2025-26) నుండి ₹53.5 లక్షల కోట్లకు పెరిగినా, అందులో మైనారిటీలకు దక్కిన వాటా అల్పమని ఆయన పేర్కొన్నారు. దేశ జనాభాలో 15% ఉన్న మైనారిటీలకు ఈ కేటాయింపులు ఏ మూలకూ సరిపోవని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ ఒక్కటే 2025-26లో తన మైనారిటీ సంక్షేమ శాఖకు ₹3,591 కోట్లు కేటాయించిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా దాదాపు ₹4,000 కోట్లను కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. దేశం మొత్తం కోసం కేంద్రం కేటాయించిన ₹3,400 కోట్లు, తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కేటాయించిన నిధుల కంటే తక్కువగా ఉండటం శోచనీయమని తెలిపారు. అప్పట్లో మొత్తం బడ్జెట్ ₹16.65 లక్షల కోట్లు ఉన్నప్పుడే మైనారిటీలకు ₹3,531 కోట్లు కేటాయించారని, బడ్జెట్ ₹53.5 లక్షల కోట్లకు చేరినప్పటికీ, కేటాయింపులు ₹3,400 కోట్లకు పడిపోవడం పురోగతి కాదు, తిరోగమనం అని ఆయన ధ్వజమెత్తారు. మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు, విద్యా సహాయ పథకాలు బలహీనపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి కార్యక్రమాలకు సరైన నిధులు లేకపోవడం వల్ల యువత ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, రీజినల్ రింగ్ రోడ్, మూసీ నది పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన, నిధులు లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రాలకు పన్నుల వాటా ను 50% కి పెంచాలన్న డిమాండ్‌ను పట్టించుకోకుండా, 41% దగ్గరే ఉంచారని విమర్శించారు. “సబ్కా సాత్, సబ్కా వికాస్” అనేది కేవలం నినాదాలకే పరిమితమైందని, గణాంకాలు చూస్తే మైనారిటీల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం స్పష్టమవుతోందని షబ్బీర్ అలీ అన్నారు.
