. . . రాత్రికి రాత్రే 14 ఎకరాల ఫారెస్ట్ భూమి చదును
. . . ట్రాక్టర్ డోజర్ స్వాధీనానికి వెళ్లిన అటవీ అధికారులు
. . . అడ్డుకున్న గిరిజనులు
. . . పురుగుల మందు తాగిన మహిళ
నాగిరెడ్డిపేట, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లాలో శుక్రవారం రాత్రి అటవి ప్రాంతంలో ట్రాక్టర్ లు, డోజర్ లు పెట్టి చదును చేస్తున్నారని సమాచారం వెళ్లిన అటవి అధికారులను, తండా వాసులు అడ్డుకున్నారు. నాగిరెడ్డి పేట్ మండలం పల్లెబోగుడా తండాలో రాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అటవీ భూమిని చదును చేసేందుకు వినియోగించిన ట్రాక్టర్ డోజర్ను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను గిరిజనులు నాగిరెడ్డిపేట మండలం పల్లే బొగుడ తాండాలో అడ్డుకోని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ట్రాక్టర్ యజమాని వినోద్ తల్లి సంత్యాలి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అటవీశాఖ అధికారులకు అందిన సమాచారం మేరకు తండా శివారులో అటవీ భూమిలో సుమారు 14 ఎకరాలను ట్రాక్టర్ డోజర్ సహాయంతో చదును చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎల్లారెడ్డి అటవీ రేంజ్ అధికారి రమేష్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని,భూమి చదును చేసేందుకు వినియోగించిన ట్రాక్టర్ డోజర్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే గతంలో ఇతరులు ట్రాక్టర్లతో ఫారెస్ట్ భూమిని చదును చేసినప్పటికీ తమ వాహనాలను ఎందుకు తీసుకెళ్తున్నారు అని గిరిజనులు అధికారులు ప్రశ్నిస్తూ అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం,తోపులాట చోటుచేసుకున్నాయి. ట్రాక్టర్ను తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్న సమయంలో యజమాని వినోద్ తల్లి సంత్యాలి పురుగుల మందు తాగినట్లు స్థానికులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తండావాసులు ద్విచక్రవాహనంపై ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ట్రాక్టర్కు నిప్పంటించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఘటన గురించి తెలుసుకున్న నాగిరెడ్డిపేట పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
