-ఎస్ సి, ఎస్ టి చట్ట ప్రకారం మరో పదేళ్ల కఠిన జైలు శిక్ష
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక యువకుడిని హత్య చేసిన కేసులో కారడి సాయి కుమార్ కు జీవిత ఖైదు,షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడని తెలిసి నేరం చేసినందుకుగాను మరో పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పై జరిగిన అత్యాచారాలను విచారణ చేసే న్యాయస్థానం స్పెషల్ జడ్జి సుగాలి నారాయణ గురువారం తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ గ్రామ నివాసులైన కారడి సాయి కుమార్,మెట్టుమీది బస్వరాజ్ స్నేహితులు వీరిద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. పని పాట లేకుండా మద్యం సేవిస్తూ తిరిగేవారు.మద్యం తాగినప్పుడల్ల బస్వరాజ్ డబ్బులు ఇవ్వమని సాయి కుమార్ ను ఇబ్బందులకు గురి చేసేవాడు. సాయి కుమార్ కు పెద్ద కొడప్గల్ లో ఒక ప్లాట్ ఉండడంతో దానిని అమ్ముకొనగ 25 లక్షలు సమకూరడంతో అందులో కొన్ని లక్షలతోని గ్రామ శివారులోని ప్రణయ్ రెడ్డి ప్లాట్స్ లలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసుకుని ఇంటిని నిర్మించుకుని పనిలో ఉండగా కూడా ఇద్దరు మద్యం తాగేవారు.డబ్బుల కోసం బస్వరాజ్ అడగడం మనసున పట్టకుండా చేయడంతో ఇతగాని చంపేస్తే పీడ విరగడ అవుతుందని బావించిన సాయి కుమార్ తాను కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో దావత్ చేసుకుందామని 2023 నవంబర్ 25 న పిలవడంతో అక్కడికి వెళ్లాడు బస్వరాజ్. ఇద్దరు కలిసి మద్యం సేవించారు. బస్వరాజ్ తిరిగి డబ్బులు కావాలని బలవంతం చేస్తూ కట్టెతో సాయి తలపై కొట్టాడు అదే కట్టే తీసుకున్న సాయి బస్వరాజ్ తలపైన కొట్టడంతో కింద పడ్డ అతనిని అక్కడ ఉన్న కొబ్బరి తాడుతో మెడ చుట్టూ ఉచ్చు బిగించి చంపి వేశారు అని నేర అభియోగాలు కోర్టు విచారణ లో రుజువు అయినట్లు స్పెషల్ జడ్జి సుగాలి నారాయణ తమ తీర్పు లో నిర్దారించారు. హత్య చేసిన నేరంకు గాను సాయి కుమార్ కు జీవిత ఖైదు, షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి అని తెలిసి నేరం చేసినందుకుగాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం పది సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించినట్లు పి పి దయాకర్ గౌడ్ పేర్కొన్నారు.
