. . . ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ కోదండరాం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజల పోరాటలతోనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ, కన్వీనర్ గైని గంగారం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు గుర్తింపు కోరుకోవడం ఉద్యమకారుల హక్కు అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గుర్తింపు పత్రాలు అందజేస్తామన్నారు. ఉద్యమకారులతో సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ఆలోచించి ఉద్యమకారులను గుర్తించేందుకే ఈ కమిటీ ముందుకు వెళ్తుందన్నారు. ఉద్యమకారుల సంక్షేమమే లక్ష్యంగా ఈ కమిటీ పని చేస్తుందన్నారు. 679 జీవో ద్వారా ఈ కమిటీని వేయడం జరిగిందన్నారు. 1956 నుంచి తెలంగాణ వచ్చేవరకు వివిధ దశలుగా ఉద్యమం జరిగిందని, పాల్గొన్న ఉద్యమకారులందరిని గుర్తించి వారి సంక్షేమం కోసం కృషి చేయడమే లక్ష్యమన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఎలాంటి సూచనలు చేయాలో కమిటీ పనిచేస్తుందన్నారు. ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఉద్యమకారున్ని గుర్తించి తీరుతామన్నారు. ఈ కమిటీ కాలయాపన కమిటీ కాదని, ఉద్యమకారులకు న్యాయం చేసే వరకు విస్తమించేదే లేదన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ కు ఉన్న చరిత్ర ఎక్కడ లేదనీ, అది సాధించుకున్న ఘనత ఉద్యమకారులకు దక్కుతుందన్నారు. నిజమైన ఉద్యమకారులను గుర్తించడమే లక్ష్యంగా కమిటీ ముందుకు సాగుతుందని చెప్పారు. ఉద్యమ కారుల పోరాటాలు త్యాగాలను గుర్తిస్తామన్నారు. నిజాయితీతో కూడిన ఉద్యమం ఎక్కడ చూడలేదనీ, తెలంగాణ అన్ని రాష్ట్రాల లాగా సాధించిన రాష్ట్రం కాదనీ, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. త్వరలో తెలంగాణ చరిత్ర రికార్డు చేస్తామని, నిజామాబాద్ అంటేనే తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుందని, ఉద్యమాల గడ్డ నిజామాబాద్ అని అన్నారు. ఉద్యమకారుకు చింతించాల్సిన అవసరం లేదనీ, మీకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. నమోదు కోసం ఆన్ లైన్ లో కూడా వెబ్ సైట్ ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఏ పార్టీ వ్యక్తి అని చూడకుండా నిజమైన ఉద్యమకారులను గుర్తించడమే ఏజెండాగా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. చివరి ఉద్యమ కారుని పేరు నమోదు చేసే దిశగా పనిచేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీ నీ ఏర్పాటు చేయాలని అనుకుం టున్నామనీ గుర్తు చేశారు. మన చరిత్రను మనమే చెప్పుకోవాల్సిన అవసరం ఉందనీ, ఎవరు ఏ విధంగా పని చేశారో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డా.రవీంధ్ర నాథ్ సూరి, తెలంగాణ శంకర్, పులగం మోహన్, హుస్సేన్, ఆదే ప్రవీణ్, చింత మహేష్, శ్రీకాంత్, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.

