. . . బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకరమైన రోజులు వచ్చాయని , కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలన వల్ల తెలంగాణ వందేళ్లు వెనక్కివెళ్లి పరిస్థితి తలెత్తిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అవేధన వ్యక్తం చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ….అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని విరుచుకుపడ్డారు. అబద్ధం అద్దం ముందు నిలబడితె రేవంత్ రెడ్డి బొమ్మ కనబడుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టి ఎక్కువ కాలం పరిపాలించలేరని స్పష్టం చేశారు. అలవిగాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చారని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ గుర్తు చేశారు అన్నారు.130 ఏళ్ల చరిత్ర ఉన్నదని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుందని ప్రశ్నించారు. చేతిలో ఎర్రబుక్కు పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఇటీవల గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని చెప్పారు. రైతు భరోసా, రేషన్ కార్డులు ఎవరికి ఇస్తున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని, సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చుని తయారు చేసిన లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లోకి తీసుకొచ్చి చదువుతున్నారని వివరించారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే అది తుది జాబితా కాదని మాటమారుస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనతో ఉందని అనుమానం వ్యక్తం చేశారు.నిజామాబాద్ జిల్లాకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్యాకేజీ 21 పనులు పూర్తి చేయని చేతగాని ప్రభుత్వం అని ధ్వజమెత్తారు.18 ఏళ్లు నిండిన ఆడపిల్లల స్కూటీలు ఏమైయ్యాయని అడిగారు అన్నారు.ఎల్లారెడ్డి పాఠశాలలో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థత కు గురికావడం బాధాకరమన్నారు. పసుపు పంట మార్కెట్ కు వస్తున్న నేపథ్యంలో కనీస మద్దతు ధర ప్రకటించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గోన్నారు.

