బాన్సువాడ, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని సంగం, అంకోల్ తండా, హాజీపూర్, అంకోల్ గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి, ఐదవ తరగతి విద్యార్థులకు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తరపున స్టడీ మెటీరియల్ లను అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు సునీల్ రాథోడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్య వైపు రాణించాలని గొప్ప ఉద్దేశంతో తన వంతుగా ప్రతి పాఠశాలకు నాలుగు స్టడీ మెటీరియల్ లను అందిస్తున్నానని, గురుకులాల్లో సీటు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరును తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజుల్లో ఎవరూ దోచుకోలేని ఆస్తి విద్య ఒక్కటే అని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే అది చదువుతోనే సాధ్యమవుతుందని, కావున ప్రతి ఒక్కరూ బాగా చదివి సీటు సంపాదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, సంగం పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్ దొండొబా, పరవయ్య పాల్గొన్నారు.
