27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మనోరమలో అనుమానాస్పద స్థితిలో స్టాఫ్ నర్సు మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆసుపత్రి మనోరమలో స్టాఫ్ నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన శనివారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా డొంగిల్ కు చెందిన శిల్ప (27) మనోరమ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహించగా శిల్ప విశ్రాంతి తీసుకుంటానని చెప్పి ఆసుపత్రిలోనే నిద్రించింది. ఉదయం తోటి సిబ్బంది శిల్పను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా చలనం లేకపోవడంతో డాక్టర్లకు సమాచారం అందించారు. ఆసుపత్రి వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి తమ కూతురు మరణంపై అనుమానం ఉందని స్థానిక 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఆసుపత్రిలో శుక్రవారం విధులు నిర్వహించిన సిబ్బందిని స్టేషన్ లో విచారించారు. శిల్ప మృతిపై అనుమానాలను నిర్ధారించేందుకు పోస్టుమార్టం చేయించారు.

. . . ఏడాదిలో రెండవ స్టాఫ్ నర్సు మృతి

మనోరమ ఆసుపత్రిలో శనివారం ఉదయం స్టాఫ్ నర్సు శిల్ప మరణం విషయం సంచలనం రేపింది. ఏడాది క్రితం మోపాల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన స్టాఫ్ నర్సు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు ఆసుపత్రిలో సీనియర్ వైద్యుడే వేదింపులు కారణమని సూసైడ్ నోట్ లో రాసింది. దానితో బాధిత కుటుంబ సభ్యులు మనోరమ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. మోపాల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బందికి ఎలాంటి పీఏ, ఈఎస్ఐ సౌకర్యాలు లేవని ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత ఆసుపత్రిలో పని చేస్తున్న వారు వేతనాల్లో కోతలు వద్దని కోరువడం వల్లనే పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించడం లేదని ఆసుపత్రి వర్గాలు తెలుపడం గమనార్హం.

More articles

Latest article