. . . యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
. . . ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటే ఉన్నత అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్) లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఔత్సాహిక ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి నిష్ణాతులైన వారిచే నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చొరవతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సలహాదారులతో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ, వేగంగా విస్తరిస్తున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదని, పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడేలా సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకున్నప్పుడే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులు కేవలం స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే సాంకేతిక విద్యాభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఐ.టి.ఐలకు అనుసంధానంగా మార్కెట్ డిమాండ్ తో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెడుతూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించిందని గుర్తు చేశారు. గతంలో ఐటిఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సరైన ప్రోత్సాహం ఉండేది కాదని, కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టిందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కూడా హై-టెక్ నైపుణ్యాలు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో తక్షణమే ఉపాధి లభించేలా ప్రణాళికలు చేపడుతూ తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ధృడ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. తాను కూడా బీ.టెక్ చేశానని, అయితే సివిల్ సర్వీసెస్ ను లక్ష్యంగా ఎంచుకుని ప్రణాళికాబద్ధంగా కృషి చేసి ఐ.ఏ.ఎస్ అయ్యానని అన్నారు. యువత తల్చుకుంటే ఏదైనా సాధించవచ్చని, కృషి, పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణ అవసరం అని కలెక్టర్ ఉద్బోధించారు. విద్యార్థులు అనునిత్యం కొత్తకొత్త అంశాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలని, ఏ.ఐ కోర్సులకు మంచి డిమాండ్ ఉందని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం కలిగి ఉండి, సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను చాటితే ఎంతో ఉన్నత స్థాయికి చేరవచ్చని, ఇందుకు ఉబర్, జోమాటో సంస్థలే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, కాకతీయ, క్షత్రియ, విజయ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలల నిర్వాహకులు రజనీకాంత్, అల్జాపూర్ శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

