30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేయడం ఉద్యమ చరిత్రలోనే కీలక ఘట్టం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో ఎండల లక్ష్మీనారాయణ తన ఎమ్మెల్యే పదవిని సైతం గడ్డి పోచగా భావించి రాజీనామా చేయడం తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ బీజేపీ శాసనసభాపక్ష నేత ఎండల లక్ష్మీనారాయణ ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి చిన్న రాష్ట్రాలకు అనుకూలం, తెలంగాణ ఏర్పాటుకు పూర్తిగా బిజెపి సహకరిస్తుంది అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఎండల లక్ష్మీనారాయణ ఎంతో కృషి చేశారని, ఆయన కృషి వల్లే ఆనాడు యావత్తు తెలంగాణ సమాజం బిజెపిని గుండెల్లో పెట్టుకున్నదని గుర్తు చేశారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ తన పదవి మీద ఎలాంటి వ్యామోహం లేకుండా తెలంగాణ సాధన కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందడం ఎండల లక్ష్మీనారాయణ యొక్క ఔన్నత్యానికి నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఎండల లక్ష్మీనారాయణ బాల్యం నుంచి నికార్సైన కార్యకర్త అని సిద్ధాంత విలువలు, నిష్ట కలిగిన వ్యక్తి కాబట్టే ఎన్నో రాజకీయ ఆటుపోట్లను తట్టుకొని పీసీసీ అధ్యక్షుడిని ఓడించి తెలంగాణ ఉద్యమ శక్తిని ఢిల్లీకి చాటి చెప్పాడని గుర్తు చేశారు. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్, ఎండల లక్ష్మీనారాయణ చేతిలో రెండుసార్లు ఘోరమైన ఓటమిని చవి చూశాడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ, ఆనాటి యూపీఏ ప్రభుత్వం వెనక్కి తగ్గి తెలంగాణ ఏర్పాటుకు ముందుకు వచ్చింద ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎండల లక్ష్మీనారాయణ యొక్క రాజీనామా ఎంతో ప్రత్యేకమైనదని ఈరోజు తెలంగాణలో బిజెపికి లభిస్తున్న ఆదరణ మొత్తానికి ఆ ఒక్క సంఘటనే కారణం అని కొనియాడారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారులను సన్మానించుకోవడం ఎంతో గర్వకారణం అని ఎండల లక్ష్మీనారాయణ అంటే తెలంగాణ ప్రజలందరికీ ఆత్మీయుడని అలాంటి వ్యక్తిని ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అలయ్ బలయ్ ఫౌండేషన్ ద్వారా తెలంగాణలోని అన్ని పార్టీల వ్యక్తులను ఎప్పటికప్పుడు కలుపుతూ సామాజిక తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్న దత్తాత్రేయ కృషి ఎంతో ఆదర్శమని అలాంటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అందుకుంటున్న ఈ సన్మానం ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, జేఏసీ నాయకులు, వివిధ ప్రజా సంఘాల ఉద్యమకారులు, ఏబీవీపీ మాజీ అఖిల భారతీయ అధ్యక్షులు మురళీమోహన్, తదితరులు పాల్గొన్నారు.

 

Resigning from the post of MLA is a key moment in the history of the movement.

More articles

Latest article