. కిడ్నాప్ అంటూ కొద్దిసేపు హల్ చల్
. ఆడుకునేందుకు జీజీహెచ్ నుంచి బయటికి వెళ్లిన బాలుడు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి నుంచి బాలుడు కిడ్నాప్ అయ్యాడని ఓ మహిళ మంగళవారం ఉదయం కొద్దిసేపు హల్ చల్ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని గౌతంనగర్ కు చెందిన కేశరెడ్డి లత తన రెండున్నరేళ్ల కుమారుడిని తీసుకుని జీజీహెచ్ కు వచ్చింది. కారిడార్ లో బాబును కిందికి దించిన ఆమె పక్కకు వెళ్లగానే బాబు కనిపించలేదు. దీంతో కంగారుపడిన లత ఆస్పత్రి అంతా వెతికింది. తన బాబు కిడ్నాప్ కు గురయ్యాడని ఆందోళన చెందింది. ఇప్పటికే విడాకులైన లత తన బాబును భర్తే కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బస్టాండ్ ఏరియాలో డ్యూటీలో ఉన్న అరుణ బాబు ఆచూకీని కనిపెట్టి తల్లికి అప్పగించింది. బాబు ఆడుకుంటూ జీజీహెచ్ నుంచి బయటికి వచ్చాడని, కిడ్నాప్ కాలేదని వన్ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి స్పష్టం చేశారు. చిన్నపిల్లలను తీసుకుని బయటికి వచ్చే తల్లిదండ్రులు వారిని వదిలి పక్కకు వెళ్లొద్దని ఆయన సూచించారు.
బాలుడిని తల్లి వద్దకు చేర్చిన పోలీసులు
