బతుకమ్మబోధన్: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోధన్ డివిజన్ స్థాయిలో ఎసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని పట్టణ సీఐ వెంకట నారాయణ కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా బస్వతారక నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బీటి నగర్ కాలనీలో వేకువజాము నుండి ఇంటింటికి తిరిగి ముమ్మర తనిఖీలు నిర్వహించినట్లు సిఐ వెంకట్ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఏసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ నేరాల నియంత్రణకై, అక్రమ కార్యక్రమాలకు కళ్లెం వేసేందుకు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని, సుమారు 110 బైకులు, 10 ఆటోలు, ఒక కారుతో పాటు 45 లిక్కర్ బాటిల్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వాహనాల సరైన ధ్రువపత్రాలను పరిశీలించి వాటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణ సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ పట్టణంలో వాహన తనిఖీల్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, మైనర్లకు బైకులు ఇస్తే వాహన యజమానులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మద్యం తాగి వాహనాలను నడిపితే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ ఆపరేషన్లో సిఐలు విజయబాబు, కృష్ణ, ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్, ఎస్సైలు హబీబ్, కళ్యాణి, వంశీ కృష్ణ, ఏఎస్ఐ చిరంజీవి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

