. . . నిజామాబాద్ మెడికవర్ హాస్పటల్ లో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నిపుణుల ప్రెస్ మీట్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేయవచ్చని సెంటర్ హెడ్ సంపత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 53,000 కు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త కేసు వెలుగులోకి వస్తోందని అంచనాలు సూచిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, ముఖ్యంగా నిజామాబాద్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్‌లో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ చికిత్సలో తాజా అభివృద్ధులు, ఆధునిక సాంకేతికతలు, సమగ్ర వైద్య విధానాలపై నిపుణులు వివరించారు. క్యాన్సర్ చికిత్సలో తాజా అభివృద్ధులు, ప్రెసిషన్ థెరపీలు, సమగ్ర వైద్య విధానాలు అనే అంశంపై వారు మాట్లాడుతూ నిజామాబాద్, పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా బ్రెస్ట్, సర్వికల్, మౌత్, లంగ్ క్యాన్సర్ కేసులు అధికంగా కనిపిస్తున్నాయన్నారు. జీవనశైలి మార్పులు, పొగాకు వినియోగం, ఆలస్యంగా పరీక్షలు చేయించుకోవడం ప్రధాన కారణాలని తెలిపారు. డా. రవి చందర్ వెలిగేటి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్టు & రోబోటిక్ సర్జన్ మాట్లాడుతూ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం ప్రాణాలను కాపాడే అత్యంత కీలక అంశమని, రోబోటిక్, మినిమల్లి ఇన్వేసివ్ సర్జరీల వల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, త్వరితగతిన కోలుకునే అవకాశం లభిస్తోందన్నారు. ప్రారంభ దశలోనే చికిత్స ప్రారంభిస్తే పూర్తి నయం చేసే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. డా.అన్వేష్ ఎండ్ల, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్టు మాట్లాడుతూ ఆధునిక రేడియేషన్ టెక్నాలజీలు మిల్లీమీటర్ స్థాయిలో ఖచ్చితత్వంతో పనిచేస్తాయని, ఇవి కేవలం క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని, ఆరోగ్యకర కణజాలాన్ని రక్షిస్తాయన్నారు. దీంతో దుష్ప్రభావాలు తగ్గి, రోగులు సురక్షితంగా, సమర్థవంతంగా చికిత్స పూర్తి చేసుకోవచ్చని చెప్పారు. అదేవిధంగా మల్టీడిసిప్లినరీ విధానం ద్వారా ఆంకాలజిస్టులు, రేడియాలజిస్టులు, సర్జన్లు, ఇతర నిపుణులు కలిసి ప్రతి రోగికి సమగ్ర చికిత్స అందిస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడం మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు.