– పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విద్యుత్ సిబ్బంది
– ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేసిన కాంగ్రెస్ నాయకుడు
– మనో వేదనలో ఏఈ
నిజామాబాద్, బతుకమ్మ: కరెంట్ బిల్లు కట్టాలని అడిగినందుకు విద్యుత్ సిబ్బందిపై ఓ వినియోగదారుడు దాడి చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిని మెండోరా మండల కాంగ్రెస్ నాయకుడు ఒకరు పరోక్షంగా బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశాడు. దీంతో విద్యుత్ సిబ్బంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బిల్లులు వసూలు చేయాలని కంపెనీ పైనుంచి ఒత్తిడి చేస్తుండగా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉందని, తరచూ బాల్కొండ నియోజకవర్గంలో ఇటువంటి ఘటనలు చోటు చేసకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
ఈనెల 26వ తేదీన మెండోరా లో బిల్లులు వసూలు చేసేందుకు ఏఈతోపాటు లైన్ మెన్, అసిస్టెంట్ లైన్ మెన్ వెళ్లారు. ఓ వినియోగదారుడి ఇంటికి వెళ్లిన వారు పేరుకుపోయిన బకాయిలను కట్టాలని కోరారు. ఈ క్రమంలో తీవ్ర అసహనానికి లోనైన వినియోగదారుడు బిల్లు కట్టకపోతే కనెక్షన్ తొలగిస్తారా? అంటూ దాడికి దిగాడు. తాము పై అధికారుల ఆదేశానుసారం నడుచుకుంటామని విద్యుత్ సిబ్బంది తెలుపగా, వెంటనే కనెక్షన్ పునరుద్ధరించాలని ఏఈ చేయిని పట్టుకుని వినియోగదారుడు లాగడంతోపాటు లైన్ మెన్ గల్లా పట్టుకున్నాడు.
విషయం తెలుసుకున్న మండలంలోని విద్యుత్ సిబ్బంది అందరూ పోలీస్ స్టేషన్ కు చేరకున్నారు. ఏఈతో సహా సిబ్బంది అంతా చర్చించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించి రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. సదరు వినియోగదారుడు సైతం ఎదురు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చిన మండలానికి చెందిన నాయకుడు వినియోగదారుడిపై విద్యుత్ సిబ్బంది ఫిర్యాదు చేయకుండా ఒత్తిడి చేశాడు. తాము వద్దని చెప్పినా ఫిర్యాదు చేస్తే మీరు దొరకక పోరు.. అప్పుడు మీ సంగతి చూస్తాం.. అంటూ బెదిరించడంతో విద్యుత్ సిబ్బంది వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది.
మనోవేదనలో ఏఈ, సిబ్బంది
బిల్లులు కట్టాలని అడిగినందుకు వినియోగదారుడు దాడి చేశాడని ఏఈలైన్ మెన్అసిస్టెంట్ లైన్ మెన్ తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. ఉన్నతాధికారులుయూనియన్లు పట్టించుకోకవడం వల్లే ఈ పరిస్థితి ఉందని విద్యుత్ శాఖలో పని చేస్తున్న సిబ్బంది అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలంలో ఉన్న ఒక గ్రామంలో బిల్లు అడిగినందుకు సిబ్బందిపై దాడి జరిగింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే నియోజకవర్గంలోని మెండోరా గ్రామంలో ఏఈ పై దాడి జరగడం చర్చనీయంశంగా మారింది. ప్రభుత్వాలు మారిన విద్యుత్ సిబ్బంది పై దాడులు జరగడం మానడం లేదు.
నా దృష్టికి రాలేదు
– శ్రీనివాస్, ఏడీఈ
మెండోరాలో ఏఈ, సిబ్బంది పై దాడి జరిగిన విషయం తన దృష్టికి రాలేదని పెర్కిట్ ఏడీఈ శ్రీనివాస్ అన్నారు. పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారేమో గాని, తనకు మాత్రం రాతపూర్వకంగా ఇవ్వలేదని తెలిపారు. సబ్ డివిజన్ లో రూ. కోటికి పైగా బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలువసూలు చేయాలని క్షేత్ర స్థాయిలో ఉన్న వారికి కఠినమైన ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు. మెండోరా ఏఈ అంజాద్ పాషాతో మాట్లాడగా.. చిన్న గొడవనే, రాజీ అయిపొయింది. మరోసారి జరిగితే చూద్దాం అని చెప్పడం విశేషం.
