. ఐదుగురు డీలర్ల గుప్పిట్లో నిజామాబాద్ సిటీ
. రోజు లావాదేవీలు రూ.10 లక్షల పై మాటే..
. జైలుకు వెళ్లి వచ్చినా దందా ఆపని డీలర్లు
. పదుల సంఖ్యలో మట్కా బుకీలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఐదుగురు బుకీలు.. ఒక్కొక్కరి కింద పదుల సంఖ్యలో ఏజెంట్లు.. వీరంతా కలిసి జిల్లా కేంద్రంలో మట్కా దందాను యథేచ్ఛగా నడుపుతున్నారు. చేతుల్లోకి డబ్బులు తీసుకుని చీటీల్లో మట్కా నంబర్లు వేసే పాత పద్ధతి ఎప్పుడోపోయింది. ఇప్పుడు అంతా ఆన్ లైన్ జమానా. ఏజెంట్లకు ప్రత్యేక కోడ్ లు, ఆన్ లైన్ లో డబ్బులు ట్రాన్స్ ఫర్ ఇలా సాగుతోంది దందా. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రం పేకాట, మట్కా, ఆన్ లైన్ బెట్టింగ్ వంటి వాటికి కేరాఫ్ గా మారింది. మహారాష్ర్ట సరిహద్దుకు నిజామాబాద్ జిల్లా కేంద్రం పట్టుమని 35 కిలో మీటర్ల దూరంలో ఉండటం, రైలు, రోడ్డు రవాణా వంటి వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో అక్కడి మట్కా ఇప్పుడు ఇందూరులో జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రానికి చెందిన ఐదుగురు మట్కా డీలర్లు ఆన్ లైన్ లోనే మట్కా సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారు. నగరంలోని ఐదో టౌన్ పరిధిలో ఉన్న నాగారం ప్రాంతానికి చెందిన ఒకరు మట్కా సేట్ గా పేరు గాంచారు. అదే పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి నగర్ కు చెందిన ఇద్దరు, గౌతం నగర్ కు చెందిన ఒకరు, నిజాం కాలనీకి చెందిన మరొకరు ప్రధాన డీలర్ గా చలమాణి అవుతున్నారు. వీరు పోరుగు రాష్ట్రాలకు చెందిన మట్కా నిర్వాహకులతో సంబంధాలను కొనసాగిస్తూ ఇక్కడ ఐడీలను ఇవ్వడంతోపాటు బుకీల వద్ధ ప్రతి సాయంత్రం డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు. మట్కా నంబర్లు సెలక్ట్ చేసుకోవడం, డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడం ఇలా అంతా ఆన్ లైన్ లో సాగుతుండడంతో మట్కా గుట్టు ఎక్కడకూడా బయట పడటం లేదు. పేరుకు పెద్ద మనుషులుగా, పోలీస్ స్టేషన్ లలో పంచాయితీలు సెటిల్ చేసే వారు కుడా డీలర్లుగా, బుకీలుగా ఉండటంతో మట్కా దందా పై చర్యలు శూన్యమయ్యాయి. నాగారం ప్రాంతానికి చెందిన ప్రధాన డీలర్ ను గతంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. అదే మాదిరిగా గౌతం నగర్ కు చెందిన ప్రధాన డీలర్ కంఠేశ్వర్ కేంద్రంగా కొనసాగించిన మట్కా దందాపై ప్రత్యేక విభాగం దాడులు చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపినా సదరు వ్యక్తి దందా మాత్రం ఆపడం లేదు. అంతా తెలిసి శాంతి నగర్ కు చెందిన ఇద్దరిపై మాత్రం పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒక్కొక్క ప్రధాన డీలర్ ( సేట్) తన వద్ద సబ్ ఏజెంట్ ( బుకీలను) పెట్టుకుని వారికి రోజుకు లక్ష వరకు టార్గెట్ గా వసూళ్లు చేస్తున్నారు. అంతా హైటెక్ పద్ధతిన కొనసాగుతుండడం, దందా గిట్టు బాటు అవుతుండటంతో బుకీలకు కొదవ లేకుండాపోయింది. ముందు లాభాలు చూయించి ఆ తరువాత బానిసలుగా మార్చే హై టెక్ మట్కా మోసంలో అమాయకులు బలవుతున్నారు.
