28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆపరేషన్ కవచ్‌ సక్సెస్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సినిమాను తలపించిన కామారెడ్డి పోలీసుల చర్యలు

 

. . . గంటల్లోనే దొంగ అరెస్ట్

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా పోలీసుల చురుకైన స్పందన మరోసారి నేర నియంత్రణలో వారి సామర్థ్యాన్ని నిరూపించింది. అర్ధరాత్రి జరిగిన చిన్న దొంగతనం కేసును కూడా సినిమాటిక్ స్టైల్‌లో చేధించిన ఈ ఘటన, జిల్లాలోని ‘ఆపరేషన్ కవచ్’ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుందో స్పష్టంగా చూపించింది.

. . . అర్ధరాత్రి దొంగతనం… తెల్లవారేసరికి క్లైమాక్స్!

దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో జూన్ 11 రాత్రి ఓ వ్యక్తి ఇంటి ముందు నిద్రపోతుండగా దొంగతనం జరిగింది. ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి, మొబైల్ ఫోన్ మరియు రూ.2,500 నగదును చోరీ చేసి పరారయ్యాడు. తెల్లవారుజామున ఇంట్లో శబ్దాలు రావడంతో యజమాని లోపలికి వెళ్లి చూడగా దొంగ పారిపోతూ కనిపించాడు.

. . . డయల్ 100 అలర్ట్‌ తో యాక్షన్ మోడ్‌లో పోలీసులు

బాధితుడు వెంటనే డయల్–100కు సమాచారం అందించగా, కామారెడ్డి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ తక్షణమే స్పందించింది. దొంగ వేసుకున్న దుస్తుల వివరాలను అన్ని స్టేషన్లు, పెట్రోలింగ్ బృందాలకు వైర్లెస్ ద్వారా పంపించారు. క్షణాల్లోనే జిల్లావ్యాప్తంగా ‘ఆపరేషన్ కవచ్’ బృందాలు నిఘా వలయాన్ని ఏర్పాటు చేశాయి.

. . . చెక్‌పోస్ట్ వద్ద సినిమాటిక్ ట్విస్ట్

లింగాపూర్ నుంచి కామారెడ్డి వైపు ఉన్న చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో తాడ్వాయి వైపు నుంచి వచ్చిన ఓ ఆటోలోని వ్యక్తి, కంట్రోల్ రూమ్ ఇచ్చిన డ్రెస్ డిస్క్రిప్షన్‌కు సరిపోవడంతో పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

. . . నేరం ఒప్పుకున్న నిందితుడు

విచారణలో నిందితుడు రాథోడ్ బొజ్జు (45), కన్నాపూర్ తండా, రామారెడ్డి మండలం నివాసిగా గుర్తించారు. అతను లింగాపూర్‌లో జరిగిన దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి చోరీ సొత్తు అయిన మొబైల్ ఫోన్ మరియు నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రకారం, అతను పాత నేరస్థుడిగా పలు దొంగతనం కేసుల్లో గతంలో జైలు శిక్ష అనుభవించినట్లు వెల్లడైంది. కేసు నమోదు చేసిన దేవునిపల్లి పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.

. . . పోలీసులకు ఎస్పీ అభినందనలు

ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. వేగవంతమైన స్పందన, సమన్వయం, అప్రమత్తత కారణంగానే గంటల్లోనే కేసు ఛేదించగలిగామని ఆయన పేర్కొన్నారు. ‘ఆపరేషన్ కవచ్’ నేర నియంత్రణలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని, ప్రజలు కూడా అనుమానాస్పద విషయాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు.

Operation Kavach a success.

More articles

Latest article