29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సన్మానాలకు అలవాటు పడుతున్న అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

  • గొర్రె దాటుడు పద్ధతిగా మారుతున్న సన్మానాల కార్యక్రమం

 

బతుకమ్మ, నాగిరెడ్డిపేట : ప్రజా ప్రతినిధులు ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుతూ, అలాగే వారు ప్రజలకు అందించిన ఉత్తమ సేవలను గుర్తిస్తూ కృతజ్ఞత భావంతో వారిని ప్రజలు కానీ, నాయకులు కానీ శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించడం సాంప్రదాయం. కానీ ప్రస్తుతం ఈ సన్మానాల పద్ధతి కాస్త దారి తప్పి గొర్రె దాటుడు పద్ధతిలో ప్రజా ప్రతినిధుల నుండి అధికారుల వరకు పాకిపోయింది. ప్రస్తుతం కొంతమంది అధికారులు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన, గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఇలా ప్రతి ఒక్కరు ప్రభుత్వ అధికారులను శాలువాలు కప్పి సన్మానిస్తున్నారు. ప్రజలకు అధికారికంగా సేవలందించాల్సిన అధికారులు కూడా తమకు సన్మానాలు చేస్తుంటే చాలా గొప్పగా అనుభూతిని పొందుతూ తనకేమీ తెలియనట్లుగా రాజకీయ నాయకులతో శాలువాలు కప్పించుకుని సన్మానాలు చేయించుకుని తమకేమీ తెలియనట్లుగా పత్రికలకు టీవీలకు ఫోజులు ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా పోలీసు వ్యవస్థలో కూడా ఈ సన్మానాల కార్యక్రమం ఈ మధ్యన కొత్త ట్రెండును సంతరించుకుంది. పోలీస్ బాసు లు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సన్మానాలే, ఒక చోట నుండి మరోచోటికి బదిలీ అయినా సన్మానాలే జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులను రాజకీయ నాయకులు సన్మానించడం ఒక ఎత్తు అయితే, సమాజంలో జరుగుతున్న అవినీతిని వెలికి తీయాల్సిన జర్నలిస్టులు కూడా అధికారులను సన్మానించడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.  ప్రజా ప్రతినిధులలో ముఖ్యంగా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా పెద్ద స్థాయి వారికి సన్మానం చేయడం ఒక సమంజసమైన పద్ధతి. కానీ ప్రస్తుతం నడుస్తున్న కాలంలో కొంతమంది ప్రజా ప్రతినిధులు, చోటా మోట నాయకులు, కార్యకర్తలు తమ తమ పలుకుబడిని చాటుకునే ఉద్దేశంతో, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారికంగా సేవలందించాల్సిన ప్రభుత్వ అధికారులకు కూడా ఘనంగా సన్మానాలు చేయడం ఎంతవరకు సమంజసమో, వారు సన్మానాలు చేయించుకోవడం కూడా ఎంతవరకు సమంజసమో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

More articles

Latest article